
ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ రాజీనామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ అన్ని పదవుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు శనివారం రాజీనామా లేఖను పంపారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నానని, అయితే పార్టీలో కొందరికి తన అంకితభావం, సహృదయత నచ్చలేదని అమనతుల్లా ఖాన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఓ మహిళను బెదిరించిన కేసులో ఢిల్లీ పోలీసులు ఇటీవల అమనతుల్లా ఖాన్ను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ మంత్రి సందీప్ కుమార్ ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నట్టు ఇటీవల ఓ సీడీ బయటకురావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు ఆప్ నుంచి బహిష్కరించారు. సీడీలో ఉన్న మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సందీప్పై రేప్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.