
ఎమ్మెల్యేల కుటుంబాలతో సీఎం భేటీ
బలం.. కావాల్సిన దానికంటే ఎక్కువే. ఇంకా చెప్పాలంటే చట్టసభలో ప్రత్యర్థులే లేరు. కానీ.. పార్టీలో ఏదో అలజడి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ. గెలిచిన కొద్ది రోజులకే ఒకరిద్దరు ఎమ్మెల్యేల తిరుగుబావుటా, వరుసగా ఉద్వాసనకు గురవుతున్న మంత్రులు, వారిలో కొందరి అరెస్టులు.. ఇలా మలుపులతో సాగిపోతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ నౌక.. ఈ సాయంత్రం కాస్తంత సేద తీరింది.
పార్టీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలతో సీఎం, సీఎంతో ఎమ్మెల్యేలు మనసువిప్పి మాట్లాడటంతో సర్వత్రా ఊరట లభించింది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో, మరి కొదరిని ఎందుకు పట్టించుకోలేదో తదితర అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలకు వివరించినట్లు తెలిసింది.
అనూహ్యపరిణామాలపట్ల ఆయా కుటుంబాల్లో ఆందోళన చెలరేగడం సహజమేనని, అయితే, రాజకీయాల్లో ఇలాంటివి సహజంగానే భావించాలని ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు సీఎం కేజ్రీవాల్ సూచించారని సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాదిన్నర తర్వాతైనా కుటుంబాలతోసహా తమతో కేజ్రీవాల్ మనసువిప్పి మాట్లాడటం ఆనందం కలిగించిందని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
ఇటీవలే అవినీతి కేసులో ఇరుక్కున్న ఆరోగ్య, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఆసిమ్ అహ్మద్ ఖాన్ పదవీచ్యుతుడయ్యారు. ఈయనతో కలిపి గడిచిన ఎనిమిది నెలల్లో కేజ్రీవాల్ మంత్రివర్గం నుంచి ఆరుగురు సభ్యులు బయటకు వచ్చారు. భార్యపై హత్యాయత్నం కేసులో సోమనాథ్ భారతి జైలుపాలయ్యారు. జూన్ నెలలో నకిలీ డిగ్రీల కేసులో జితేందర్ సింగ్ తోమర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.