నకిలీ డిగ్రీతో టీచర్, ఆ తర్వాత ఎమ్మెల్యే
చండీగఢ్: ఆప్ ఎమ్మెల్యే సురీందర్ సింగ్ గతంలో నకిలీ డిగ్రీతో టీచర్ ఉద్యోగం పొందినట్టుగా హరియాణా పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సురీందర్ అంతకుముందు హరియాణాలోని ఝజ్జర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశారు.
సురీందర్ ఇంటర్ వరకూ మాత్రమే చదువుకున్నారని, నకిలీ డిగ్రీ పట్టాతో ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం పొందారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ తన్వార్ ఝజ్జుర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం సురీందర్ విద్యార్హతలు గురించి కోరగా ఆయన ఇంటర్ వరకు మాత్రమే చదివినట్టు వెల్లడైందని, కానీ డిగ్రీ విద్యార్హతలతో ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేశారని కరణ్ చెప్పారు. సురీందర్పై కేసు నమోదు చేశామని, ఆయన డిగ్రీ పత్రాలను పరిశీలిస్తామని ఝజ్జర్ ఎస్పీ జషన్దీప్ సింగ్ చెప్పారు. కాగా ఇది బీజేపీ కుట్ర అని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవే ఆరోపణలపైనే గతంలో ఢిల్లీ పోలీసులు విచారణ చేసి సురీందర్కు క్లీన్ చిట్ ఇచ్చారని, ఇప్పుడు హరియాణాలో ఇదే కేసు నమోదు చేశారని చెప్పారు.