
పరారీలో ఉన్న సినీ నటుడు అరెస్ట్
వెండి తెరపై అతనో సహాయ నటుడు. మూడు చిత్రాల్లో పోలీస్ అధికారిగా కూడా నటించారు. అయితే తెర వెనుక అతనో దొంగ. 14 సంవత్సరాల క్రితం మోటార్ సైకిళ్లను తస్కరించి జైలు పాలయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత బెయిల్‌పై వచ్చి.. పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు నిఘా వేసి అతన్ని అరెస్ట్ చేశారు. హెసరుఘట్ట సమీపంలోని విధాన సౌధ లేఔట్‌లో నివాసముంటున్న నరసింహమూర్తి అలియాస్ మూర్తి (44) పలు కన్నడ చిత్రాల్లో సహాయ నటుడిగా నటించాడు.
గూళి, బోంబాట, స్వయంవర అనే చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించాడు. ఇతను బైక్‌లను చోరీ చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. 2002లో మూర్తిని అరెస్ట్ చేసిన మల్లేశ్వరం పోలీసులు, అతని నుంచి 22 బైక్‌లను స్వాధీనం చేసుకొని జైలుకు పంపారు. రెండేళ్ల పాటు శిక్ష అనుభవించిన మూర్తి, బెయిల్‌పై బయటకు వచ్చి పరారయ్యాడు. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ మూర్తి నేతృత్వంలో ప్రత్యేక బృందం నిఘా వేసి మూర్తిని అరెస్ట్ చేసింది.