సీఎం ఫొటోను ‘చెప్పు’తో కొట్టారు
బెంగళూరు: భారత సైనికులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారిని అరెస్టు చేయాలని, అమ్నెస్టీ సంస్థను నిషేధించాలని పేర్కొంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు కర్ణాటకలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కోల్పోయారు. బాగల్‌కోటెలో జరిగిన నిరసన కార్యక్రమంలో కొంతమంది ఏబీవీపీ కార్యకర్తలు పోలీసుల కన్నుగప్పి రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి హెచ్.వై. మేటి ఇంట్లోకి చొచ్చుకువెళ్లారు. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులకు ఆ ఇంట్లో సిద్దరామయ్య ఫొటో కనిపించింది. అంతే సంయమనం కోల్పోయిన నిరసనకారులు ఫొటోను చెప్పుతో కొట్టారు. అంతేకాక అక్కడ ఉన్న ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసనకు నేతృత్వం వహించిన కుమార్ హీరేమఠ్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని వాహనాల్లో వేరే ప్రాంతాలకు తరలించారు.
అనంతరం నిరసనకారులు దాదాపు గంటపాటు అమాత్యుడి ఇంటిముందు నిరసనకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక సంఘటన గురించి తెలుసుకొని అక్కడికి వచ్చిన మంత్రి ఉమాశ్రీ మీడియాతో మాట్లాడుతూ... శాంతియుతంగా తమ నిరసనను తెలియజేయాలని కోరారు. సంయమనాన్ని కోల్పోయి ఈ విధంగా చేయడం ఎంతమాత్రం సరికాదని పేర్కొన్నారు.