స్వామి... సారొచ్చొరు
చెన్నై: రాష్ట్రంలో అసెంబీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతుండగా అకస్మాత్తుగా ఇద్దరు ప్రముఖులు రంగ ప్రవేశం చేసి, వార్తల్లో వ్యక్తులుగా మారారు. ఒకరు రాజకీయ రంగంలో రాటుదేలిన కాంగ్రెస్ నేత పి.చిదంబరం కాగా, మరొకరు ఆధ్యాత్మిక రంగంలో అందెవేసిన చేయిగా ఉన్న మదురై ఆధీనం అరుణగిరి నాథర్. డీఎంకేతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో 41 స్థానాల్లో పోటీ చేస్తోంది.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అంటే ఏమాత్రం గిట్టని చిదంబరం ఆయన ఓటమే తన గెలుపుగా భావిస్తూ ఎన్నికల ప్రచారం వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో తన కుమారుడు కార్తీ చిదంబరానికి తగిన స్థానం కల్పించలేదన్న అక్కసుతో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేయడంలేదు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం గురువారం చెన్నై చేరుకోవడంతో ఆయన ఇంటి నుంచి కాలు బైటపెట్టారు. పుదుక్కోట్టై జిల్లాలో మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం చేసి మమ అనిపించుకున్నారు.
ఇదిలా ఉండగా, ఆధ్యాత్మిక జీవితంలో మునిగితేలే మధురై ఆధీనం అరుణగిరి నాథర్‌కు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అంటే వల్లమాలిన అభిమానం. ఇటీవలే స్వయంగా పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి అమ్మకు తన మద్దతు ప్రకటించారు. అంతేగాక అడపాదడపా రాబోయేది అన్నాడీఎంకే ప్రభుత్వమేనని పత్రికా ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా శుక్రవారం మరో అడుగు ముందుకు వేసి తంజావూరు నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి రంగస్వామి కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ప్రచారం చేశాను, అధిక స్థానాల్లో గెలుపొందింది, నేడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి దిగాను, అమ్మ ప్రభుత్వం గ్యారంటీ అంటూ వేదికపై నుండే జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే అభ్యర్థుల కోసం మరిన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నట్లు మధురై ఆధీనం స్వామి తెలిపారు.