కుప్పకూలిన సంకీర్ణ సర్కార్ మళ్లీ గద్దెనెక్కిన ఇందిరమ్మ!
సాక్షి, న్యూఢిల్లీ:
ఎమర్జెన్సీ అకృత్యాలను సహించలేక భారతీయ ఓటర్లు భారీ మెజారీటీతో గద్దెకెక్కించిన సంకీ ర్ణ ప్రభుత్వం ముడేళ్ల ముచ్చటే అయ్యింది. రాజకీయ అస్థిరతను సహించలేని దేశవాసులు 1980 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారు. ఢిల్లీలో కూడా ఒక్క స్థానంలో మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అటల్ బిహారీ వాజపేయి విజయం సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
1977లో ప్రజలు గెలిపించిన జనతా ప్రభుత్వం నేతల స్వార్థ రాజకీయాలకు బలైంది. ప్రధానమంత్రి పదవి కోసం మొరార్జీదేశాయ్, చరణ్‌సింగ్, జగ్జీవన్‌రామ్‌ల మధ్య జరిగిన తగవులాటలతో మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా కొనసాగలేకపోయారు. భారతీయ జన్‌సంఘ్ సంకీర్ణం నుంచి బయటకు రావడంతో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి మెరార్జీదేశాయ్ రాజీనామా చేశారు. ఇతర మిత్రపక్షాల సహాయంతో చరణ్‌సింగ్ ప్రధానమంత్రి సింహాసనం అధిష్టించారు.
కానీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని మాటిచ్చిన కాంగ్రెస్ వెనుకడుగు వేయడంతో చరణ్‌సింగ్ పార్లమెంటును ఎదుర్కోకుండానే రాజీనామా చేయవలసివచ్చింది. అధికార పక్షంలోని వైరుధ్యాలను తనకు అనుకూలంగా మలచుకోవడంతోపాటు ప్రభుత్వం వేధింపులకు గురైన నేతగా ప్రజలకు తనను చూపించుకోవడంలో ఇందిరాగాంధీ సఫలమయ్యారు. సానుభూతి పవనాలతోపాటు సమర్థనాయకత్వం కోరుకున్న ప్రజలు ఇందిరాగాంధీకి పట్టం కట్టారు.
ఢిల్లీవాసులు కూడా జనతా ప్రభుత్వం కీచులాటలతో విసిగిపోయారు. కాంగ్రెస్‌నే మళ్లీ గెలిపించారు. న్యూఢిల్లీలో మాత్రం అటల్ బిహారీ వాజపేయి కాంగ్రెస్ అభ్యర్థి సి.ఎం. స్టీఫెన్‌ను ఓడించారు. చాందినీ చౌక్, ఔటర్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సదర్, సౌత్ ఢిల్లీ, కరోల్ బాగ్ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటువేశారు. చాందినీ చౌక్‌లో భికూ రామ్‌జైన్, కరోల్‌బాగ్‌లో ధరమ్‌దాస్ శాస్త్రీ, సదర్ నుంచి జగ్‌దీశ్ టైట్లర్ విజయం సాధించారు. సౌత్ ఢిల్లీలో చరణ్‌జీత్ సింగ్, బీజేపీ నేత విజయ్‌కుమార్ మల్హోత్రాను ఓడించారు. ఈస్ట్ ఢిల్లీలో కిషోరీలాల్‌పై హెచ్‌కేఎల్ భగత్ విజయం సాధించారు.
ఔటర్ ఢిల్లీ నుంచి సజ్జన్‌కుమార్ అనూహ్యంగా టికెట్ సాధించడమే కాక, చౌదరి బ్రహ్మప్రకాశ్ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సజ్జన్‌కుమార్ గెలుపుతో ఢిల్లీలో జాట్ రాజకీయాలు బలం పుంజుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని 30 లక్షల మంది ఓటర్లలో దాదాపు 20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు స్థానాలకు 168 మంది అభ్యర్థులు తలపడ్డారు. వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు.