
ఎంజీఆర్‌కు ఘన నివాళి
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ 98వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు శనివారం నివాళులు అర్పించారు. ప్రజలు ఎంజీఆర్ అంటూ అభిమానంగా పిలుచుకునే ఎంజీ రామచంద్రన్ ఆకర్షణ అంతా ఇంతా కాదు. డీఎంకే నుంచి వైదొలిగి, అన్నాడీఎంకే స్థాపించిన ఎంజీఆర్‌పై రాష్ట్ర ప్రజల అభిమానం రాజకీయాలకు అతీతమైనది. 1917లో సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక)లోని కాండిలో జన్మించి 1987 డిసెంబరు 29న కాలం చేశారు. ఎంజీర్ మరణించి 37 ఏళ్లు దాటుతున్నా ప్రజల హృదయాల్లో ఆయన ముద్ర చెరిగిపోలేదు. అందుకే శనివారం ఎంజీఆర్ జయంతిని వాడవాడలా జరుపుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఎంజీఆర్ ఫొటోలను ఉంచి మైకుల ద్వారా ఆయన నటించిన సినిమాల్లోని పాటలతో హోరెత్తించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇంటి వద్దనే జయ నివాళి
పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో అలంకరించిన నిలువెత్తు ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముకుళిత హస్తాలతో కొద్దిసేపు మౌనం పాటించారు. పార్టీ కార్యాలయంలోను, గిండిలోని ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని ఎంజీఆర్ విగ్ర హం వద్ద ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పలువురు మంత్రులు నివాళులర్పించారు. చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎంజీఆర్ విగ్రహానికి పార్టీ కార్యాలయ కార్యదర్శి మధుసూదన్ తొలుత పూలమాల వేసి శ్ర ద్ధాంజలి ఘటించారు. పలువురు మంత్రులు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నేతల సమక్షంలో ఎంజీఆర్‌పై ప్రత్యేక సంచికను విడుదల చేశారు. పార్టీ కార్యాలయం ఉన్న రాయపేట రోడ్డు ఎంజీఆర్ అభిమానులతో నిండిపోయింది. టీనగర్‌లోని ఎంజీఆర్ స్మారక మందిరం వద్ద పలువురు మాజీ మంత్రులు, పార్టీ నేతలు నివాళులర్పించారు. పుదియనీది కట్చి అధ్యక్షులు ఏసీ షణ్ముగం 200 మందికి ఉచితంగా చీరలు పంచిపెట్టారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ కోయంబేడులోని తన పార్టీ కార్యాలయంలో ఎంజీఆర్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.