తండ్రి దర్శకత్వంలో తనయ
తండ్రి దర్శకత్వంలో తనయ హీరోయిన్‌గా నటించడం అనేది బాలీవుడ్‌లో జరిగింది గానీ దక్షిణాదిలో ఇంత వరకు జరగలేదు. ముఖ్యంగా కోలీవుడ్‌లో తనయ సౌందర్య దర్శకత్వంలో తండ్రి సూపర్‌స్టార్ రజనీకాంత్ (కోచ్చడయాన్) నటించారు. ఇందుకు భిన్నంగా తాజాగా తండ్రి (అర్జున్) తన కూతురు (ఐశ్వర్య) హీరోయిన్‌గా చిత్రం తెరకెక్కించనున్నారన్నది లేటెస్ట్ న్యూస్. ఐశ్వర్య ఇప్పటికే విశాల్ సరసన మదయానై చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.
దీంతో ప్రస్తుతం ఆమె తన తండ్రి హీరోగా నటిస్తున్న స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న జైహింద్-2 చిత్ర నిర్మాణ కార్యక్రమాల్లో సహకారం అందిస్తున్నారు. ఈ మధ్య ఒకటి రెండు వాణిజ్య ప్రకటనల్లో నటించేసిన ఐశ్వర్య త్వరలో తన తండ్రి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్బంగా నటుడు అర్జున్ మాట్లాడుతూ, జై హింద్ -2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయన్నారు. చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి తన కూతరు హీరోయిన్‌గా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చెప్పారు. తన వద్ద రెండు మూడు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
వాటిలో ఒక స్క్రిప్టును ఫైనలైజ్ చేసి తెరకెక్కిస్తానని పేర్కొన్నారు. అవి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఉంటుందని దీనిని 80 శాతం షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. తన కూతురిని డెరైక్ట్ చేయడానికి ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ చిత్రంలో తాను నటించబోనని దర్శక, నిర్మాత బాధ్యతలను మాత్రమే నిర్వహిస్తానని వివరించారు. ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా రూపొందిస్తానని అయితే ఆ రెండో భాష ఏదనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. అలాగే అర్జున్ తన తాజా చిత్రం జై హింద్-2 చిత్రం విజయం పై కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.