సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించిన ఎన్సీపీ... అభ్యర్థుల జాబితాకు తుదిమెరుగులు దిద్దుతోంది. అన్ని పార్టీలకంటే ముందుగానే జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా ఇప్పటికే పలువురి పేర్లను ఖరారు చేసింది. మిగిలిన అభ్యర్థులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఖరారైన అభ్యర్థుల జాబితాలో గోండియా లోక్‌సభాస్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన విమానయన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, ఉస్మానాబాద్ ఎంపీ పద్మసింగ్ పాటిల్ విజయ భాంబోలి (పర్భణి) తదితరులున్నారు. హింగోలి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి సూర్యకాంత్ పాటిల్, శివాజీ మానేలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ స్థానం నుంచి వీరిలో ఒకరిని ఖరారు చేయాల్సి ఉంది.
మరోవైపు అహ్మద్‌నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్సీపీలో చేరిన రాజీవ్ రాజలేతోపాటు బబన్‌రావ్ పాచ్‌పుతే , ఆయన కుమారుడు విక్రమసింగ్ ల పేర్లను పరిశీలించాలని అధిష్టానాన్ని కొందరు నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. వీరితోపాటు అహ్మద్‌నగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఘనశ్యామ్ శేలార్ ఆసక్తి కనబరుస్తుండడంతో ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలియవచ్చింది. ఎన్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బీడ్ నియోజకవర్గం స్థానానికి సంబంధించి మంత్రి జయదత్ క్షీరసాగర్, సురేష్‌ల పేర్లు తెరపైకొచ్చాయి. గత ఎన్నికల్లో పరాజయం పాలైన రమేష్ ఆడస్కర్ కూడా మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర శాసనసభ్యుడు ఎమ్మెల్యే రవి రాణా భార్య సినీ నటి నవనీత్ కౌర్ పేరు పరిశీలనలో ఉంది. ఇక రావేర్ నియోజకవర్గం నుంచి రవీంద్ర పాటిల్ పేరును పరిశీలించాల్సిందిగా అక్కడి నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి విన్నవించారు.
బరిలోకి దిగేందుకు నేతల సుముఖత
త్వరలో జరగనున్న సార ్వత్రిక ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌తోపాటు ఎన్సీపీకి చెందిన మంత్రులు, ఇతర అగ్రనాయకులు సుముఖత వ్యక్తం చేశారు. మొత్తం 48 స్థానాలకు 22 నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. కొద్దినియోజకవర్గాలలో భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌తో కలసి బరిలోకి దిగనుంది. లోక్‌సభ ఎన్నిలకు సన్నద్ధతకు సంబంధించి రెండురోజులపాటు జరిగిన సమీక్షా సమావేశంలో బరిలోకి దిగాలని ఆశిస్తున్నవారందరితో ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ భేటీ అయ్యారు. ఈ నెల 10 లేదా 15వ తేదీలోగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే అవకాశముందని పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ మీడియాకు వెల్లడించారు. ఏ స్థానాన్ని కేటాయించినా పోటీ చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అజిత్‌పవార్‌తోపాటు ఇతర మంత్రులు పార్టీ అధినేతకు స్పష్టం చేశారు. ఇక బీడ్ లేదా శిరూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అజిత్ ఆసక్తి కనబరిచారని జాదవ్ తెలిపారు. శరద్‌పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్న మఢా నియోజకవర్గం నుంచి అజిత్ బరిలోకి దిగుతారా అని మీడియా ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. పార్టీ అధినేత కుమార్తె, ఎంపీ సుప్రియాసూలేను రాష్ట్ర రాజకీయాల్లోకి దించేందుకు వీలుగా అజిత్‌ను లోక్‌సభ బరిలోకి దించుతున్నారా అని ప్రశ్నించగా అమె ఎంపీ అని, బారామతి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ఒక్కొక్క స్థానం నుంచి పోటీ చేయాలంటూ తాము భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కు ప్రతిపాదిస్తామన్నారు. మూడుచోట్ల ఒక పార్టీ స్థానంలో మరొక పార్టీ పోటీ చేసే అవకాశముందన్నారు. రాయ్‌గఢ్ నియోజక వర్గం కాంగ్రెస్ కోటాలోనే ఉందని, అయితే గత మూడు ఎన్నికల్లో వారు పరాజయం పాలయ్యారన్నారు. ఒకవేళ సీట్ల మార్పిడి జరిగితే ఈ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు తాను ఆసక్తి కనబరిచానన్నారు.
కాగా జాదవ్ రాయ్‌గఢ్ జిల్లా చిప్లున్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి విదితమే.
కాగా తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ద్వితీయ తరం నాయకత్వం వహించనుంది. రాష్ర్టంలో మొత్తం 48 స్థానాలు ఉండగా శరద్‌పవార్ సమీప బంధువు, ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌తోపాటు ఆ పార్టీకి చెందిన ఇతర మంత్రులు, అగ్రనాయకులు లోక్‌సభపై దృష్టి సారించారు. లోక్‌సభ ఎన్నికలకు టికెట్లను ఆశిస్తున్నవారితో ఆ పార్టీ అధినేత పవార్... రెండురోజులపాటు భేటీ అయిన సంగతి విదితమే. లోక్‌సభ ఎన్నికల విషయమై ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు భాస్కర్ జాదవ్ మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ బీడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయక తప్పదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 22 స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
క్లాక్... టిక్ టిక్
Published Mon, Jan 6 2014 10:36 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement
Advertisement