రజనీ పాత్రలో అజిత్?
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు నటుడు అజిత్ అంటే చాలా ఇష్టం. అజిత్‌కూ రజనీ అంటే చాలా గౌరవం. ఇంతకు ముందు రజనీ నటించిన బిల్లా చిత్రం రీమేక్‌లో అజిత్ నటించి మెప్పించారు. ఇప్పడు రజనీ నటించాల్సిన పాత్రలో అజిత్ నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. అజిత్ తొలిసారిగా స్టార్ డెరైక్టర్ శంకర్‌తో కలిసి పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విషయానికొస్తే రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన ఎందిరన్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లోనూ అనువాదమై విజయవంతమైంది.
ఈ చిత్రానికి కొనసాగింపు తెరకెక్కించాలన్నది దర్శకుడు శంకర్ ఆకాంక్ష. ఇందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నారు. ఎందిరన్ -2 ను కూడా రజనీకాంత్‌తోనే రూపొందించాలన్నది శంకర్ భావన. ఈ విషయమై శంకర్, రజనీ కాంత్‌లు ఇటీవల చర్చించుకున్నట్లు సమాచారం. అయితే ఎందిరన్-2, చిత్రంలో రజనీకాంత్ నటించడానికి ఆసక్తి చూపడంలేదని తెలిసింది. అందుకు కారణం ఆయన ఆరోగ్యమే. ఎందిరన్-2 చిత్రంలో నటించే విషయమై రజనీకాంత్ ఇంతకు ముందు తనకు చికిత్స అందించిన వైద్యులను సంప్రదించగా వారు నటించవద్దని చెప్పినట్లు సమాచారం.
శరీరానికి ఒత్తిడి కలిగించే పాత్రల్లో నటించరాదని వైద్యులు రజనీకాంత్‌కు సూచించారట. ఎందిరన్-2 చిత్రంలో శరీర బరువు తగ్గించి నటించే సన్నివేశాలుంటాయట. దీంతో ఈ చిత్రంలో సూపర్ స్టార్ నటించే అవకాశం లేదని తెలుస్తోంది. రజనీ కాకుంటే శంకర్ దృష్టిలో అజిత్ ఉంటారని సమాచారం.ప్రస్తుతం విక్రమ్ హీరోగా ఐ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శంకర్ తదుపరి ఎందిరన్ -2 కు తెరరూపం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.