
అజిత్ రూటే వేరు
చెన్నై : అజిత్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇతర నటులకు భిన్నమైన మనస్తత్వం అజిత్‌ది. పరిశ్రమలోని ఏ విషయం గురించి పట్టించుకోని అజిత్ తన పని తాను చేసుకుంటూపోతారు. పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. అయినా అది ఆయన్ని వెతుకుంటూ వస్తుంది. తాజాగా వేదళం చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన అజిత్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తన కాలి శస్త్రచికిత్సను ఇటీవలే చేయించుకున్నారు. విశ్రాంతి కోసం త్వరలో అమెరికా వెళ్లనున్నారు. అక్కడ మూడు నెలలు ఉంటారు. ఆయన తదుపరి చిత్రం ఏమిటన్న విషయం ఆసక్తిగా మారింది.
వీరం, వేదళం చిత్రాల దర్శకుడు శివకే అజిత్ మరో అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. మరో పక్క అజిత్ కోసం దర్శకుడు విష్ణువర్ధన్ ఒక చారిత్రక కథను సిద్ధం చేస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ పేరు వినిపిస్తోంది. ఈయన అజిత్‌తో ఎన్నై అరిందాల్ చిత్రా న్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఇది హిట్ అయితే సీక్వెల్ తీస్తానని చెప్పగా అజిత్ ఓకే అన్నారట. ఊహించినట్లుగానే ఎన్నై అరిందాల్ మంచి విజయం సాధించింది. గౌతమ్‌మీనన్ ఇప్పటి వరకు హిట్ అయిన తన చిత్రాలను ఇతర భాషల్లో రీమేక్ చేశారు గానీ, ఏ చిత్రానికీ సీక్వెల్ చేయలేదు.
తొలిసారిగా ఇప్పుడు ఎన్నై అరిదాల్ చిత్రానికి పార్టు-2 తీయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అందుకు కథను కూడా తయారు చేసుకున్నట్లు టాక్. ఎన్నై అరిందాల్ చిత్రంలో అనుష్కను కాపాడే అజిత్, భర్త మరణించగా చిన్న పిల్లతో ఒంటరిగా జీవించే త్రిషను ప్రేమిస్తారు. ఆమె విలన్ చేతిలో హతం కావడంతో ఆమె కూతురి సంరక్షణ బాధ్యతల్ని అజిత్ తీసుకుంటారు.
రెండో భాగంలో ఆ అమ్మాయి సమస్యల్లో చిక్కుంటే అందులోంచి అజిత్ ఎలా కాపాడరన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడుకుని ఉంటుందని గౌతమ్ మీనన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరి ఈ కథను అజిత్ ఓకే చేస్తారా.. లేదా? అసలు ఎన్నై అరిందాల్-2 పట్టాలెక్కుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.