కావేరి నదీ జలాల్ని అడ్డుకునేందుకు కర్ణాటక చేస్తున్న కుట్రల్ని భగ్నం చేయడం లక్ష్యంగా రాష్ట్రంలో మహోద్యమానికి అఖిల పక్షం నిర్ణయించింది. 28న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చారు. శనివారం చెన్నైలో జరిగిన అఖిల పక్షం భేటీకి అన్నాడీఎంకే డుమ్మా కొట్టింది. కర్ణాటక చర్యలకు కళ్ల్లెం వేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం పన్నీరు సెల్వం లేఖాస్త్రంతో సరి పెట్టారు.
సాక్షి, చెన్నై : తమిళనాడు-కర్ణాటక మధ్య ఏళ్ల తరబడి కావేరి నదీ జలాలపై వివాదం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.ఎట్టకేలకు ట్రిబ్యునల్‌లో తమిళనాడుకు అను కూలంగా తీర్పు రావడంతో ఆ జలాలమీద ఆధార పడ్డ డెల్టా అన్నదాతల్లో ఆనందం వికసించింది. అయితే, కేంద్రంలోని పాలకులు ఆ తీర్పు మేరకు కావేరి అభివృద్ధి మండలి, కావేరి నదీ జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో మెతక వైఖరి అనుసరిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న కర్ణాటక సర్కారు కొత్త ఎత్తుకు సిద్ధ పడింది. తమిళనాడు సరిహద్దుల్లోని తమ రాష్ట్ర భూ భాగం మేఘదాతులో రెండు చిన్న సైజు డ్యాముల్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఈ డ్యాముల్ని నిర్మించిన పక్షంలో తమిళనాడులోకి కావేరి జలాలు ఒక్క బొట్టుకూడా వచ్చే అవకాశాలు లేదు. దీంతో కర్ణాటక చర్యల్ని ఎండగడుతూ అన్నదాతలు ఉద్యమాన్ని సాగిస్తూ వస్తున్నారు. అయినా కేంద్రంలోని పాలకులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే వస్తున్నారు. తమతో కలసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేతులు కలపాలని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. మహోద్యమంతో అటు కేంద్రం, ఇటు కర్ణాటక పాలకుల నడ్డి విరవడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలో కదలికలు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
అఖిల పక్షం భేటీ: రైతు సంఘాలు ఇచ్చిన పిలుపునకు సర్వత్రా స్పందించారు. శనివారం చెన్నైలోని అమిర్ మహల్ సమీపంలోని ఎంఎస్ మహల్‌లో అఖిల పక్షం భేటీ జరిగింది. డీఎంకే తరపున టీకేఎస్ ఇళంగోవన్, డీఎండీకే తరపున బాల అరుల్ సెల్వన్, తమిళ మానిల కాంగ్రెస్ తరపున జ్ఞాన దేశికన్, కాంగ్రెస్ తరపున బలరామన్, పీఎంకే తరపున అరంగ వేలు, ఎండీఎంకే తరపున మల్లై సత్య, బీజేపీ తరపున తమిళిసై సౌందరరాజన్, వీసీకే తరపున తిరుమావళవన్, ఎస్‌ఎంకే తరపున ఎర్నావూర్ నారాయణన్, ఎంఎంకే తరపున జవహరుల్లా, ముస్లిం లీగ్ తరపున మహ్మద్, ఐజేకే తరపున రాజేంద్రన్‌లతో పాటుగా చిన్న పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వర్తక, కార్మిక సంఘాల నాయకులు తరలి వచ్చి రైతు సంఘాలకు అండగా నిలబడ్డారు. అఖిల పక్షం భేటీకి అందరూ తరలి వచ్చినా అధికార అన్నాడీఎంకే మాత్రం డుమ్మా కొట్టింది. అదే సమయంలో కర్ణాటక చర్యల్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం పన్నీరు సెల్వం లేఖాస్త్రం సంధించడం గమనార్హం.
బంద్‌కు పిలుపు: రైతు సంఘాల సమన్వయ కర్త పీకే పాండియన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక కుట్రల్ని భగ్నం చేయడం లక్ష్యంగా మహోద్యమాన్ని చేపట్టేందుకు నిర్ణయించారు. అఖిలపక్షంలోని అన్ని పార్టీల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తీర్మానించారు. ఈనెల 28న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చారు. ఇక, కావేరి డెల్టా తీరంలో మిథైన్ తవ్వకాల ప్రాజెక్టును ఉపసంహరించుకుంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని ఈ అఖిల పక్షం భేటీలో ఆహ్వానించారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే, కావేరి హక్కుల పరిరక్షణకు సహకరించాలని విన్నవించారు. ఇక, ఈ అఖిల పక్షంకు అన్నాడీఎంకే డుమ్మా కొట్టిన దృష్ట్యా, రాష్ట్రంలో బంద్ సజావుగా సాగేనా అన్నది అనుమానమే.
మహోద్యమం
Published Sun, Mar 22 2015 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement