చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రశాఖలో ఆధిపత్యపోరు నేపథ్యంలో కమలనాథుల మధ్య కలహాల కాపురంగా మారింది. రాష్ట్రశాఖ పనితీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సైతం అసంతృప్తిని వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో కొత్త నియామకాలు సాగడం మరింత కల్లోలానికి దారితీసింది. రాష్ట్రంలో 60 వేల పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రానికి వందమంది చొప్పున 60 లక్షల మంది సభ్యులను చేర్పించడం ద్వారా తమిళనాడులో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చన్నది అమిత్‌షా వ్యూహంగా ఉంది. అయితే
ఇప్పటి వరకు 30 లక్షల మంది మాత్రమే సభ్యత్వాన్ని స్వీకరించి ఉన్నారు. వాస్తవానికి ఈ నెలాఖరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగుస్తుండగా, లక్ష్యానికి 50 శాతం దూరంగా ఉన్నందున మరోవారం పొడిగించారు. రాష్ట్ర బీజేపీలో అనేక వర్గాలు ఉండగా, వీరిలో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ బలమైన వర్గానికి నేతగా కొనసాగుతున్నారు.
రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు, ప్రధాన కార్యదర్శి మోహన్‌రాజు మధ్య సఖ్యత లేదు. పొన్ రాధాకృష్ణన్ వర్గంలోనే మోహన్‌రాజులు కొనసాగుతున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల మధ్య విభేదాల వల్ల ఎవరి పంచన చేరితే ఏమో అనే మీమాంస కారణంగా తటస్తులు సభ్యత్వం తీసుకోవడంలో వెనకాడుతున్నారు. అంతేగాక ఇద్దరు ప్రధాన వ్యక్తుల కారణంగా పార్టీ బలహీన పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు సహజంగా ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కలిగిన వారై ఉండడం ఒక సంప్రదాయంగా వస్తోంది. 25 ఏళ్లకు ముందు ఆర్‌ఎస్‌ఎస్ నిర్వాహకుడిగా ఉన్న ఇల గణేషన్‌ను జాతీయ పార్టీ సేవలకు వినియోగించుకుంటున్నారు. అకస్మాత్తుగా ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర నిర్వాహకుడిగా నియామకం జరిగినట్లు తెలుస్తోంది.
ఆర్‌ఎస్‌ఎస్ కోసం పూర్తిగా పాటుపడేవారు బ్రహ్మచారులుగానే ఉండాల్సి ఉంటుంది. ఇల గణేశన్ కూడా నేటికీ బ్రహ్మచారిగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్రశాఖలో సైతం మార్పులు చేర్పులు చేయడం ద్వారా బీజేపీని బలోపేతం చేయాలని అమిత్‌షా వ్యూహంగా ఉంది. అందుకే దక్షిణ తమిళనాడు ఆర్‌ఎస్‌ఎస్ నిర్వాహుకుడు కేశవ వినాయకంను రాష్ట్ర నిర్వాహకుడిగా నియమించి కీలక బాధ్యతలు అప్పగించారు. పొన్, మోహన్‌రాజుల ఆధిపత్యాన్ని అదుపుచేసేందుకే కేశవ వినాయకంను వర్గాల మధ్యలోకి తెచ్చినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీకి మరో ఎడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఈ ఏడాది చివరిలోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అమిత్‌షా అంచనాగా ఉంది. ఈ కారణంగా రాష్ట్ర బీజేపీ అధికారం దిశగా వాయువేగంలో ముందుకు సాగాలని అన్ని వర్గాల నేతలకు అమిత్‌షా నుంచి ఆదేశాలు అందాయి.
కమలనాథుల్లో కలహాలు
Published Sun, Mar 29 2015 1:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement