
వైద్యం కోసం వెళ్లేందుకు అనుమతివ్వకపోవడంతో సరిహద్దు వద్ద కుమార్తెతో కలిసి వెనుదిరిగివస్తున్న బిజయగొమాంగో
ఒడిశా, పర్లాకిమిడి: లాక్‌డౌన్ 4.0 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చినా.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాలేదు. అత్యవస వైద్య సేవల కోసం సరిహద్దు దాటి వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యులు డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాలకు వెళ్లిపోవడంతో ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు మెరుగైన వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చికిత్స నిమిత్తం వెళుతున్నారు. వారిని పర్లాకిమిడి చెక్ గేట్ వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆంధ్రాలోకి వెళ్లేందుకు అనుమతివ్వకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుణుపురానికి చెందిన బిజయ గొమాంగో కుమార్తె మొహిసినీ గొమాంగో(10) పది రోజుల కిందట ఇంటి వద్ద ఆడుకుంటూ చెవిలో గులకరాయి పెట్టుకుంది.
చెవి, తలనొప్పి పెడుతోందని తండ్రికి చెప్పగా ఆమెను పర్లాకిమిడిలోని ఒక ప్రైవేటు క్లీనిక్‌లో చేర్చించి చికిత్స అందించారు. అయినా ఆమెకు నొప్పి తగ్గకపోవడంతో అక్కడి డాక్టర్ సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా సరిహద్దు జిల్లా శ్రీకాకుళం వెళ్లేందుకు బయలుదేరారు. పర్లాకిమిడి చెక్‌గేట్ వద్ద ఒడిశా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చికిత్స కోసం శ్రీకాకుళం వెళ్తున్నామని, అనుమతివ్వాలని పర్లాకిమిడి పోలీసులను కోరారు. వారు స్పందించకపోవడంతో కలెక్టర్‌ను కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్య పరీక్షల కోసం ప్రతి రోజు అనేక మంది రోగులు ఆంధ్రా సరిహద్దు జిల్లా శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. చెక్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు పొందేందుకు వెళ్లే వారిని అనుమతించాలని పలువురు న్యాయవాదులు, సీనియర్ సిటిజన్స్ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment