
కార్తీ చిదంబరంపై మరో కేసు
చెన్నై : రాజస్తాన్‌లో అంబులెన్స్ అక్రమాల వ్యవహారానికి సంబంధించి కార్తీ చిదంబరంపై మరో కేసు దాఖలైంది. రాజస్థాన్‌లో 108 అంబులెన్స్ సర్వీసును ఈఎంఆర్ అనే సంస్థ అందజేస్తూ వచ్చింది. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీపీఎస్ సౌకర్యంతో కూడిన అంబులెన్స్ సర్వీసుకు టెండర్ కోరారు. చికిత్సా హెల్త్‌కేర్ అనే సంస్థకు అనుమతి నిచ్చారు. ఈ సంస్థ డెరైక్టర్లుగా మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, మాజీ కేంద్ర మంత్రి వయలార్ రవి కుమారుడు కృష్ణ, రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సేవలందించిన చికిత్సా హెల్త్‌కేర్ సంస్థ ఇందుకోసం 450 అంబులెన్సులను నడిపింది. ఇం దుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంస్థ అదనపు సొమ్మును వసూలు చేసిన ట్లు ఆరోపణలు అందాయి. దీనిపై గత కాంగ్రెస్ హయాంలోనే సీఏజీ విచారణ జరిపేందుకు నాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత రాజస్థాన్‌లో వసుంధర నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అంబులెన్స్ అక్రమాల గురించి విచారణకు ఆదేశాలిచ్చింది.
ఇందులో కార్తి చిదంబరం, సచిన్ పైలట్, కృష్ణ, ఆశోక్ గెహ్లాట్, రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖా మంత్రి దూరా మీర్జాలపై సిబిఐ కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణపై ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఈ అక్రమాలకు సంబంధించి ఈడీ మరో కేసును నమోదు చేసింది.