
రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు
అనంతపురం: దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులకు కారణమైన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద నోట్లరద్దు అనంతరం సామాన్యుల చేతిలోకి రాకముందే కొత్త నోట్లు తీవ్రవాదులకు చేరాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దుతో కనీసం వారు అనుకున్న లక్ష్యం కూడా నెరవేరలేదని రఘువీరారెడ్డి అన్నారు. బ్యాంకుల్లో దొంగనోట్లు కూడా డిపాజిట్ అయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, అనంతరం జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీలు మాయల ఫకీర్లు అని పేర్కొంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమంగా దోచుకునేందుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు ఖర్చును పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే ఐదున్నర వేలకోట్లు ఖర్చు చేశామన్నారు. భారీ దోపిడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏకంగా 11వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.40 వేల కోట్లకు పెంచారని నిప్పులు చెరిగారు. ప్రాజెక్టు వ్యయాలను ఇష్టరీతిన పెంచేహక్కు మీకు ఎవరిచ్చారు అంటూ రఘువీరారెడ్డి మండిపడ్డారు.