అమ్మ ఆస్పత్రి బిల్లు ఎంతో తెలుసా..?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చేసిన చికిత్సకు చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యం బిల్లు అడగలేదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. అనారోగ్యంతో సెప్టెంబరు 22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత ఈనెల 5న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో 75 రోజుల పాటు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు.
ఈ కాలానికి చికిత్స ఖర్చు రూ.6 కోట్లు కాగా రూ.90 కోట్ల బిల్లును అపోలో ఆసుపత్రి డిమాండ్ చేసిందని, ఆరోగ్య పథకాలకు సంబంధించిన నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. జయ చికిత్సకు రూ.90 కోట్లు ఖర్చుకాలేదని, అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చయిన మాట మాత్రం వాస్తవమని వైద్యులు చెప్పారు. చికిత్స బిల్లులను ఆసుపత్రి యాజమాన్యం ఇంతవరకు కోరలేదని స్పష్టం చేశారు.