సీఎం కేజ్రీవాల్‌కు ‘జెడ్’ కేటగిరి భద్రత
లక్నో: ఢిల్లీ సరిహద్దులో ఉన్న ఘజియాబాద్‌లో నివాసముంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. భద్రత విషయంలో కేజ్రీవాల్ మొదటినుంచి తిరస్కరిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం కౌశంబీలోని సీఎం నివాసానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ(హోం) ఎ.కె.గుప్తా, డీజీపీ రిజ్వాన్ అహ్మద్ కమిటీ నిర్ణయించినట్లు అదనపు డీజీపీ ఒ.పి.సింగ్ తెలిపారు. ఢిల్లీపోలీసులకు ఈ విషయమై సమాచారం పంపించామని, అలాగే ఘజియాబాద్ జిల్లా పోలీసులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని ఆయన చెప్పారు. గత బుధవారం కౌశంబీలోని ఆప్ కార్యాలయంపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.