చిన్నమ్మకు కేసుల భయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే కార్యకలాపాలను తన కనుసన్నల్లో నడిపిస్తున్న శశికళకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల భయం పట్టుకున్నట్లు సమాచారం. అప్పీలు కేసులో ప్రతికూలంగా తీర్పు వెలువడితే తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతోనే ఆమె పార్టీ బాధ్యతలు చేపట్టడానికి వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి ముద్దాయికాగా, శశికళ రెండో ముద్దాయిగా ఉన్నారు.
చెన్నై, బెంగళూరుల్లో 18 ఏళ్లపాటూ సాగిన ఈ కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు కోర్టు 2014లో తీర్పు చెప్పింది. వీరు బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసి నిర్దోషులుగా బైటపడ్డారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది, డీఎంకేలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. ఈ అప్పీలు కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. అవినీతి నిరోధక చట్టం కింద జయపై కేసు నమోదై ఉంది. ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్నవారే ఈ చట్టం కింద శిక్షార్హులు. సీఎం హోదాలో ఉన్నందున జయకు ఈ చట్టం వర్తిస్తుందిగానీ శశికళకు వర్తించదనే వాదనను పార్టీ లేవనెత్తుతోంది.