ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా నిర్ధారిస్తూ మంగళవారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షపడినవారు ఆరేళ్లవరకూ ఎన్నికల్లో పోటీచేయడానికి, ప్రభుత్వ పద వులు నిర్వహించడానికి అనర్హులు గనుక ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలు అడియాసలైనట్టే. ఇలాంటి తీర్పు వెలువడితే ప్రత్యామ్నాయమేమిటన్న అంశంలో శశికళ వర్గానికి ముందే స్పష్టత ఉన్నది గనుక సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే మంత్రి కె. పళనిస్వామిని అన్నా డీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. గవర్నర్ సీహెచ్. విద్యాసాగరరావును ఆయన కలవడం కూడా పూర్తయింది.
కనుక సాధ్యమైనంత త్వరగా తదుపరి ఘట్టాన్ని ఆవిష్కరించాల్సింది ఇక గవర్నరే. వాస్తవానికి ఈ నెల 5న అనుకోకుండా సంభ వించిన వరస పరిణామాల్లో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తన పదవికి రాజీనామా చేయడం, లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా తానే శశికళ పేరును ప్రతిపాదించడం, ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చకచకా సంభవించాయి. ఎవరినైనా లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్నట్టు వర్తమానం అందిన వెంటనే సర్వసాధారణంగా వారిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్లు చేసే పని. కానీ శశికళ విషయంలో అలా జరగలేదు. అసలు విద్యాసాగరరావు ఎవరికీ అందుబాటులోకి రాలేదు. ఇలాంటి అయోమయ స్థితిలో ఉన్నట్టుండి ఈ నెల 7న ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం తిరగబడ్డారు. తనను బెదిరించి రాజీనామా చేయించారని అనడమే కాదు... చేసిన రాజీనామాను వెనక్కు తీసుకుంటానని కూడా ఆయన ప్రకటిం చారు. వీట న్నిటి పర్యవసానంగా రాష్ట్రంలో అలుముకున్న అనిశ్చితి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది.
విచారణ కోర్టుకు తీర్పు కాపీ అందిన వెంటనే, కర్ణాటక పోలీసులు శశికళను అదుపులోకి తీసుకుంటారు. అందుకు తమిళనాడు పోలీసులు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నట్టు కనబడుతోంది. తనకు తీర్పు కాపీ అందలేదని శశికళ చెప్ప డానికి లేదు. దాన్ని పొందే బాధ్యత ఆమె న్యాయవాదులదే. అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ ఆమె ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పిటిషన్ దాఖలు చేశారంటున్నారు. కానీ ఎలాంటి ఉపశమనమూ లభించకపోవచ్చునన్నది న్యాయ నిపుణుల మాట. ఈ తాజా పరిణామాలతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వానికి కొత్తగా ఒరిగేది ఏమీ ఉండకపోవచ్చు. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే బీచ్ రిసార్ట్స్‌లో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఆయన నివాసానికి ప్రవాహంలా వచ్చి ఉంటే వేరుగా ఉండేది. ఈ నాలుగు రోజుల్లోనూ ఆయన వద్దకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎంపీలు వచ్చారు తప్ప ఎమ్మెల్యేలు రాలేదు. శశికళను జైలుకు తరలించిన వెంటనే వారంతా పన్నీర్ గూటికొస్తారని చెబుతున్నారుగానీ ఆ అంచనాలను విశ్వసించలేం. మద్రాసు హైకోర్టు ఉత్తర్వు లతో బీచ్ రిసార్ట్స్‌కు వెళ్లిన రాష్ట్ర డీజీపీకి... తాము స్వచ్ఛందంగానే అక్కడున్నా మని ఎమ్మెల్యేలంతా చెప్పి ఉన్నారు. వారి సంఖ్య 94 అని డీజీపీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. అక్కడ లేని 32మంది పన్నీర్‌సెల్వానికి మద్దతు పలుకుతారని భావించడానికి లేదు. అలాంటి ఉద్దేశముంటే ఈపాటికే వారు ఆ పని చేసి ఉండేవారు. పన్నీర్ ఇంకా ప్రభుత్వ సారథిగా ఉన్నారు గనుక ఆయన పక్షానికి రాకుండా ఎవరూ వారిని నిరోధించలేరు. వాస్తవానికి అలాంటి ఒత్తిళ్లే మైనా ఉంటే గింటే శశికళ శిబిరంలో ఉన్నవారికే ఉన్నాయి. ఆమె వైపు నిలబడి నందుకు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవన్నీ పరిగణ నలోకి తీసుకుంటే మంగళవారం అన్నా డీఎంకే లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగిన సమయానికి మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నారని... వారు పళనిస్వామిని తమ నేతగా ఎన్నుకున్నారని నమ్మక పోవడానికి ఆస్కారంలేదు. ఈ పరిస్థితు ల్లోనైనా తానేం చేయదల్చుకున్నారో విద్యాసాగరరావు విస్పష్టంగా వెల్లడించాల్సి ఉంది. నిజానికి పన్నీర్ సెల్వం రాజీనామా ఆమోదించాక, శశికళ అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారని తెలిశాక ఆమెను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ఉండాలి. ఆమెకు బలం లేదని ఆ తర్వాత తేలితే వేరే విషయం. ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి చూడాలన్న అభిప్రాయం ఏర్పడి ఉంటే ఆ సంగతైనా ఆయన చెప్పి ఉండాల్సింది. ఏదీ చేయకపోవడంవల్ల రాష్ట్రంలో అనిశ్చితికి గవర్నర్ దోహద పడ్డారన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది.
ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ రంగం నుంచి శశికళ వైదొలగినట్ట యింది. పన్నీర్‌సెల్వం రాజీనామాను వెనక్కు తీసుకోవడం కుదరదు. ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య రెండంకెలకు కూడా చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తొలుత పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి 24 గంటల్లో బలాన్ని నిరూపించుకోమని అడగటం న్యాయం. ఆయన విఫలమైతే పన్నీర్‌కు తదుపరి అవ కాశం ఇవ్వొచ్చు తప్ప అటార్నీ జనరల్ ప్రతిపాదించినట్టు ఆయనకూ, పళని స్వామికి మధ్య అసెంబ్లీలో బలపరీక్ష పెట్టడమన్నది సరికాదు. ఇద్దరి జాబితా ల్లోనూ ఒకే పేర్లున్నప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఏ వర్గంలోనూ చేరని 32మంది ఎమ్మెల్యేలు డీఎంకేకు అనుకూలంగా మారినా, వారిలో కనీసం పదిమంది పన్నీర్ వైపు వెళ్లినా అన్నాడీఎంకేలోని పళనిస్వామి వర్గం వెనువెంటనే మైనారిటీలో పడుతుంది.
అలాంటి స్థితిలో శాసనసభను సుప్తచేతనా వస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేయడం మినహా గవర్నర్‌కు వేరే ప్రత్యామ్నాయం ఉండదు. కేంద్రం అండదండలున్నా, తగినంత సమయం ఇచ్చినా పన్నీర్ అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలుగుతారన్న నమ్మకం ఎవరికీ కలగడం లేదు. మొత్తానికి రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రాజ్య మేలుతున్న అనిశ్చితికి సాధ్యమైనంత త్వరగా తెరపడాలని అందరూ కోరుకుంటారు.
కనీసం ఇప్పుడైనా...!
Published Wed, Feb 15 2017 3:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
Advertisement