మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి
అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే పీ కరుప్పయ్య ఇంటి వద్ద దుండగులు బీభత్సం సృష్టించారు. చెన్నై రాయపేటలోని ఇంటిపై రాళ్లు రువ్వడం, కారును ధ్వంసం చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: కరుప్పయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే టిక్కెట్టుపై చెన్నైలోని హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇటీవల తుగ్లక్ పత్రిక నిర్వహించిన ఓ సమావేశంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపైనా, పార్టీ అధినేత్రి జయలలితపైనా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఒక వార పత్రిక ఎమ్మెల్యే కరుప్పయ్యతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. పార్టీ పరువును బజారుకీడ్చారనే ఆరోపణతో ఇటీవల అతన్ని పార్టీ బహిష్కరించింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత సైతం అనేక టీవీల్లో చర్చాగోష్టిలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
చెన్నై రాయపేట బిసెంట్ రోడ్డులోని ఆయన తన భార్య, కుటుంబసభ్యులతో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కరుప్పయ్య ఇంటికి ఆటోలో కొందరు దుండగులు చేరుకున్నారు. ఆ దుండగులు అకస్మాత్తుగా ఇంటిపై రాళ్లవర్షం కురిపించారు. రాళ్ల దెబ్బలకు ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమైనాయి. కరుప్పయ్య కుమారుడు ఆరుముగం దుండగులతో మీరు ఎవరు, ఎందుకు దాడులు చేస్తున్నారని కిటికీ గుండా ప్రశ్నించాడు.
అయితే అర్ముగం మాటలు పట్టించుకోని ఆగంతకులు కరుప్పయ్యను బైటకు పంపు అంటూ కేకలు వేశారు. ఆ తరువాత కూడా రాళ్లను వేయడం కొనసాగించారు. ఇంటి ప్రాంగణంలో పార్కింగ్ చేసి ఉన్న కారు అద్దాలు పగులగొట్టి పాక్షికంగా ధ్వంసం చేశారు. కరప్పయ్య దుండగులతో మాట్లాడేందుకు బైటకువచ్చే ప్రయత్నం చేయగా కొడుకుకు వారించాడు. దీంతో దుండగులు రెచ్చిపోగా ఎమ్మెల్యే కుటుంబీకులు ఇంటిలోని లైట్లను పూర్తిగా ఆర్పివేశారు. కొంతసేపు అలాగే రాళ్లదాడి కొనసాగిస్తూ కరుప్పయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తరువాత దుండగులు పారిపోయారు.
అన్నాడీఎంకే అనాగరికం: కరుప్పయ్య
పార్టీ ప్రతిష్టకు విఘాతం కలిగించినట్లు భావించిన అన్నాడీఎంకే తనను బహిష్కరించిందని, దీంతో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని కరుప్పయ్య చెప్పారు. తన నిర్ణయాన్ని హుందాగా స్వీకరించాల్సిన పార్టీ దుండగులను ఇంటిపైకి పురిగొల్పడం ద్వారా అనాగరికంగా వ్యవహ రించిందని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో భావస్వేచ్ఛకు తావులేదా అని ఆయన ప్రశ్నించారు. వేలూరులో ఒక సభకు హాజరు కావాల్సి ఉండగా, రావద్దు, వస్తే ప్రాణాలతో పోరు అనే ఫోను వచ్చిందని తెలిపారు. ఎక్కడికి వెళ్లకుండా ఇల్లే జైలుగా ఉండిపోవాలా, లేక తమిళనాడును వదిలి వెళ్లిపోవాలా, బైటకు వెళితే చంపేస్తారా, ఎవరైనా ఏదో ఒకరోజు శవం కావాల్సిందే అంటూ ఆవేశంగా మాట్లాడారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను, తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.
ముగ్గురు అరెస్ట్
దాడులు జరుగుతున్న సమయంలో దుండగులు వచ్చిన ఆటో నెంబరును ఒక వ్యక్తి నమోదు చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ నెంబరు ఆధారంగా రాయపేట శ్రీనివాస పెరుమాళ్ కోవిల్ వీధికి చెందిన కృష్ణన్, రాము, అరుళ్ అనే ముగ్గురిని శనివారం ఉదయం అరెస్ట్ చేశారు.
ఖండనలు
కరుప్పయ్య ఇంటిపై దాడికి దిగడం గర్హనీయమని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్, డీఎంకే అధినేత కరుణానిధి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, వామపక్షాల నేతలు ఖండించారు.