‘ఠాక్రే’ల తకరారు!
సాక్షి, ముంబై: దివంగత బాల్ ఠాక్రే కుటుంబసభ్యుల మధ్య ఆస్తి వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తులపై ఇటు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అటు పెద్ద కుమారుడు జయదేవ్ ఠాక్రే ఇద్దరూ కోర్టులో పిటి షన్లు దాఖలు చేశారు. ఉద్ధవ్ తన తండ్రి ఆస్తులకు సంబంధించిన పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జయదేవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆస్తుల వీలునామాలో బాల్ ఠాక్రే సంతకం లేదని, అది తప్పుల తడకగా ఉందని, అనేక అంశాలను పొందుపర్చలేదని జయదేవ్ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. ‘మా తండ్రి తన జీవితాన్నంతా మరాఠీ భాష, మరాఠీ ప్రజల అభ్యున్నతికే ధారపోశారు. అలాంటి భాషా ప్రేమికుడు తన వీలునామాను ఆంగ్లంలో రాశారంటే నమ్మశక్యంగా లేదు..’ అని జయదేవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నేనంటే మా తండ్రికి చాలా అభిమానం .. రోజూ నాతో ఫోన్‌లో సంప్రదిస్తుండేవారు..అలాంటి ఆయన నాకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని అంటే హాస్యాస్పదంగా ఉంది..’ అని జయదేవ్ ఆరోపించారు. ‘ఉద్ధవ్ పిటిషన్ లో మా తండ్రి సంపాదించిన వివిధ ఆస్తులు, బ్యాంకులో డిపాజిట్ల మొత్తం రూ.14.85 కోట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నాడు. కాని నా తండ్రి నివాసమున్న బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.40 కోట్లు ఉంటుంది.. దీంతోపాటు బ్యాంకుల్లో డిపాజిట్లు, ఇంట్లో, వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉన్న బంగారు ఆభరణాలు ఇలా రూ.కోట్లలోనే ఉంటాయి.
వీటన్నింటిని ఉద్ధవ్ వీలునామాలో చూపించలేదు..’ అని జయదేవ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఉద్ధవ్ పొందుపరిచిన ప్రకారం ఠాక్రే వీలునామా ఇలా ఉంది. ‘నా కొడుకు ఉద్ధవ్ ఠాక్రే ఎల్లప్పుడు నాతోనే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాకు నూతనోత్తేజాన్ని నింపారు. మాతోశ్రీ నిర్మాణంలో ఉద్ధవ్ పాత్ర ఎంతో ఉంది. ఆయురారోగ్యాలతో ఉద్ధవ్ తన శేషజీవితం గడపాలనదే నా చివరి కోరిక. ఉద్ధవ్ ఎంతో బాధ్యతతో పార్టీని ముందుకు నడిపిస్తారని, ఠాక్రే కుటుంబంలో శాంతిని నెలకొల్పుతారనే నమ్మకం నాకుంది. కాగా జయదేవ్ కూడా నా కుమారుడే. కాని అనివార్య కారణాలవల్ల కొన్నేళ్ల కిందట స్వయంగా మాతోశ్రీ విడిచారు. భార్య స్మితతో తెగదెంపులు చేసుకుని మరో భార్యతో దూరంగా ఉంటున్నారు. ఈ సంఘటన లతో ఎంతో బాధపడ్డాను. దీంతో నా ఆస్తుల్లో ఆయనకు ఎలాంటి వాటా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను.’అయితే జయదేవ్ ఈ వీలునామాపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చే స్తున్నారు. దీంతో ఠాక్రే ఆస్తి వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.