
భివాండిలో కుప్పకూలిన భవనం (ఫైల్ ఫొటో)
ఠాణే : ముంబైలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. శుక్రవారం భివాండిలో తహిర్ బిజ్నోర్ అనే భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. భవనాన్ని నాలుగు అంతస్తుల్లో నిర్మించేందుకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మృతులను పర్విన్ ఖాన్(65), రుస్కర్ యాకుబ్ ఖాన్(18), అస్ఫక్ ముస్తాక్ ఖాన్(38), జైబున్నిసా రఫీక్ అన్సారీ(61)లుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనలోనే గాయపడిన తొమ్మిది మందిని నగరంలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించినట్లు వివరించారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహాయ సహకారాలను అందించినట్లు తెలిపారు. భవన యజమాని పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు టీంలు రంగంలోకి దిగాయని వివరించారు.