
ధ్యాన్‌చంద్, ధోనీలపై సినిమాలు
బయోపిక్ బాటలో బాలీవుడ్
న్యూఢిల్లీ: ఇటీవల విడుదలైన ‘మేరీకోమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమవడంతో బాలీవుడ్ దృష్టంతా ఇప్పుడు బయోపిక్‌పైనే పడింది. మున్ముందు ఈ తరహా సినిమాలు వెల్లువెత్తనున్నాయి. ఈ సినిమాలు స్ఫూర్తిని కలిగిస్తాయని, ప్రేక్షకులను తొందరగా ఆకట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఒక సినిమా హిట్ అయినంతమాత్రాన అన్నీ విజయవంతమవుతాయనే గ్యారంటీ కూడా ఏమీలేదంటున్నారు. మహేందర్‌సింగ్ ధోనీ, ధ్యాన్‌చంద్ జీవితగాథల ఆధారంగా త్వరలో మరో రెండు బయోపిక్ సినిమాలు తెరకెక్కనున్నాయి. హాకీ లెజెండ్ జీవితగాధ ఆధారంగా కరణ్‌జోహార్ త్వరలో ఓ సినిమా తీయనున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వంలో ధోనీ జీవితంపై సినిమా తెరకెక్క నుంది. ఈ సినిమాకు ‘అన్‌టోల్డ్ స్టోరీ’ అని నామకరణం చేశారు. ఈ సినిమాలో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
ఈ విషయమై పీవీఆర్ సంస్థ సీఈఓ దీపక్ శర్మ మాట్లాడుతూ ‘ఇందులో రహస్యమేమీ లేదు. బాక్సాఫీస్ వద్ద ఇటువంటి సినిమాలు బాగా ఆడుతున్నాయి. అందువల్లనే ఈ సినిమాలపై మొగ్గుచూపుతున్నాం’ అని అన్నాడు. ‘ఈ సినిమాలు అందరికీ స్ఫూర్తిని కలిగిస్తాయి. అన్నిరంగాలకుచెందిన ప్రజలు ఇటువంటి వారితో తమను తాము పోల్చుకుంటుంటారు. తమ పిల్లలను ఇటువంటి సినిమాలకు తీసుకెళ్లడానికి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుచేతనంటే ఇవి మంచి సినిమాలనే విషయం వారికి తెలుసు. విజయవంతమైన సినిమాల బాటలోనే నడవాలని సహజంగానే అంతా కోరుకుంటారు’ అని అన్నాడు.