సాక్షి, న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన బీజేపీ జాతీయ మండలి సమావేశం విజయవంతం కావడం ఢిల్లీ బీజేపీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన త రువాత, ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా సతీష్ ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టిన తరువాత ఢిల్లీ బీజేపీ నిర్వహించిన మొట్టమొదటి భారీస్థాయి కార్యక్రమం ఇదే కావ డంతో ఢిల్లీ బీజేపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ బీజేపీ 90 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా పగ్గాలు చేపట్టడం కోసం జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి , కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు మొత్తం దాదానె రెండువేల మందికి పాల్గొన్నారు.
వారి ప్రయాణ, వసతి సదుపాయాలు, భోజనం, టెంట్లు, పుష్పాలంకరణ కోసం ఈ సొమ్ము ఖర్చయినట్లు చెబుతున్నారు.రవాణా సదుపాయాలను కల్పించడం కోసం పార్టీ ఆదేశాల మేరకు ఒక్కో కౌన్సిలర్ రెండేసి వాహనాలను అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. పుష్పాలంకరణకు 5 లక్షల రూపాయలు, టెంట్లకు 12 లక్షలు, భోజనం కోసం 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. నాలుగు లక్షల రూపాయలు స్టేడియం అద్దె కింద చెలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కార్యక్రమ ఏర్పాట్లను ప్రశంసించారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆనందంతో మీడియాకు చెప్పారు. 1952 నుంచి ఇప్పటి వరకు తాను పాల్గొన్న బీజేపీ కార్యక్రమాలన్నింటికెల్లా ఇది అత్యుత్తమంగా జరిగిందని సీనియర్ నేత అద్వానీ వ్యాఖ్యానించారని సతీష్ ఉపాధ్యాయ సంబరపడ్డారు.
జోష్ మీదున్న ఢిల్లీ బీజేపీ
Published Tue, Aug 12 2014 10:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement