![ఢిల్లీలో బీజేపీకి బంపర్ మెజారిటీ! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41484035696_625x300_0.jpg.webp?itok=lXaPzIXV)
ఢిల్లీలో బీజేపీకి బంపర్ మెజారిటీ!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ షాక్ తగలబోతుందా?... అవుననే అంటున్నాయి సర్వేలు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఒపినియన్ పోల్స్ ఫలితాల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ రానుందని తేలింది. టైమ్స్ నౌ, వీఎమ్‌ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో 272 సీట్లకు గానూ బీజేపీ 195 సీట్లను కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఆప్‌కు 55 స్థానాలు దక్కుతాయని తెలిపింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఆదివారం పోలింగ్ జరనున్న విషయం తెలిసిందే.
అలాగే ఏబీపీ న్యూస్ నిర్వహించిన సర్వేలో కూడా ఫలితాలు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. ఉత్తర కార్పోరేషన్‌లోని 104 స్థానాలకు గానూ 76, దక్షిణలో 104 సీట్లకు 60, తూర్పులో 64 స్థానాలకుగానూ 43 స్థానాలలో బీజేపీ గెలవనున్నట్లు సర్వే పేర్కొంది. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ మాత్రం 45 సీట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోనుందట. మొత్తంగా బీజేపీ 41.9 శాతం ఓట్ షేర్ సాధిస్తోందని ఏబీపీ న్యూస్ వెల్లడించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సాధించిన ఓట్ షేర్ సగానికి తగ్గుతుందని సర్వేలో తేలడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ, ఆప్‌ల తరువాత మూడో స్థానంలో నిలుస్తుందని సర్వేలు తెలిపాయి.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి ఆప్ను గట్టి దెబ్బ కొట్టాలని కమలనాధులు భావిస్తున్నారు. పేరుకు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలే అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికలను గమనిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికల్లో కంగుతిన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆప్ పార్టీ నేతలు చీపురును వదిలి కాషాయ కండువా కప్పుకోవడం మరోవైపు ఆప్‌కు ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు.
మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో బీజేపీ చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోగా, ఆప్ మాత్రం ఆపసోపాలు పడింది. ఇక కాంగ్రెస్ మూడోస్థానంలోనే నిలిచింది. కాగా కాంగ్రెస్ చేయించిన అంతర్గత సర్వేలో ఆ పార్టీకి 208 స్థానాలు దక్కడం ఖాయమని తేలడం విశేషం. అలాగే తమ పార్టీల అంతర్గత సర్వేల్లో ఆప్‌తో పాటు బీజేపీ కూడా ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో విజయం తమదే అని ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఢిల్లీవాసుల తీర్పు ఎవరి పక్షాన ఉంటుందనేది అంచనా వేయడానికి తర్జనభర్జనలు పడ్డారు.