ఈ ఏడాది జూన్ ఒకటో తేదీముందువరకూ వెలిసిన నగరంలోని 895 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి శుభవార్త. వీటి క్రమబద్ధీకరణకోసం
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ ఒకటో తేదీముందువరకూ వెలిసిన నగరంలోని 895 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి శుభవార్త. వీటి క్రమబద్ధీకరణకోసం ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదముద్ర వేసింది. ఇందువల్ల ఈ కాలనీల్లో నివసిస్తున్న దాదాపు 60 లక్షల మంది ప్రజలకు లబ్ధి కలగనుంది. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీకి ముందువరకూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాల్లో సవరణలకోసం ఉద్దేశించి రూపొందించిన ఆర్డినెన్స్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపారు.
అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు కటాఫ్ తేదీ మార్చి, 31, 2002 కాగా తాజా ఆర్డినెన్స్ కారణంగా ఈ గడువు జూన్, 1, 2014 అయింది. ఈ బిల్లు వల్ల ఈ ఏడాది మార్చి 31వ తేదీనుంచి జూన్ ఒకటో తేదీలోగా వెలిసిన అనధికార కాలనీలు కూడా క్రమబద్ధీకరణకు నోచుకుంటాయి. మంత్రి మండలి సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడుతూ ఆర్డినెన్స్ సవరణ వల్ల నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన 895 అనధికార కాలనీల్లో నివసిస్తున్న 60 లక్షల మంది లబ్ధి పొందుతారన్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు త్వరలోనే వెల్లడిస్తారన్నారు. ఒకసారి క్రమబద్ధీకరణ పూర్తయితే ఆయా కాలనీల్లో వసతులు మెరుగుపడతాయన్నారు.