జైలుపక్షి చేతిలో కీలుబొమ్మ సీఎం అయ్యారు
చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరొందిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే చీఫ్ శశికళను జైలుపక్షిగా సంబోధిస్తూ.. ఆమె చేతిలో కీలుబొమ్మగా పళనిస్వామిని అభివర్ణించారు. తమిళులు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా అంగీకరించడాన్ని తప్పుపడుతూ, ఇది అవమానకరమని అన్నారు. కట్జూ తమిళులను ఉద్దేశిస్తూ రాసిన బహిరంగ లేఖను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
'జైలుపక్షికి కీలుబొమ్మ తమిళనాడు సీఎం అయ్యారు. మీరు ఈ విషయంలో ఏం చేయలేకపోయారు. మీరు మహావీరులైన చోళులు, పాండ్యుల సంతతికి చెందినవారు. తిరువళ్లువర్, ఇళంగో, కంబార్, అండాల్, సుబ్రహ్మణ్య భారతి వారసులు. మీ పూర్వీకులు మిమ్మల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. నేను తమిళుడని చెప్పేందుకు గర్వంగా భావిస్తాను. ఇప్పుడు ఈ ముఖంతో ఎలా చెప్పగలను? ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగడం తమిళులకు కళంకం. ఆయన పదవిలో ఉంటే నేను తమిళుడిగా ఉండలేను. అవమానంతో, అగౌరవంతో బతకరాదు. దీనికంటే చావడం మేలు' అని కట్జూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.