కావేరి వివాదంలో మరో మలుపు
బెంగళూరు: కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య ఏర్పడిన కావేరి జలాల వివాదం మరో మలుపు తిరిగింది. కావేరి జలాశయాల్లో నీటిమట్టం బాగా పడిపోవడంతో తమిళనాడుకు ఇక నీటిని విడుదల చేయలేమని శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తద్వారా సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం సాధ్యంకాదని ఆయన చేతులేత్తేశారు.ఈ నెల 27 వరకు కావేరి నది నుంచి తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కావేరి నదిలో తగినంత నీటివనరులు లేకపోవడంతో తమిళనాడుకు నీటిని వదలబోమని సిద్ధరామయ్య చెప్పారు.
కర్ణాటకలో ప్రస్తుత పరిణామాల వల్ల రాజ్యంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కర్ణాటక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కావేరి జలాలను విడుదల చేయడం సాధ్యంకాదని ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేయవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల ఎన్నోవివాదాలు ఏర్పడుతాయని న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. నదీజలాల పంపకాల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందని, అంతేగాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు. కాగా కావేరి జలాల విడుదలపై కర్ణాటక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు.