137 ఏళ్లలో తొలిసారి...
చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రభావం తొలితరం దిన పత్రిక 'ది హిందు'పై కూడా పడింది. భారీ వర్షాల కారణంగా 'ది హిందు' ప్రింటింగ్ నిలిపివేసింది. 137 ఏళ్లలో 'ది హిందు' ప్రింటింగ్ నిలిపివేయడం ఇదే తొలిసారి. దీంతో తమిళనాడులో బుధవారం ది హిందు దిన పత్రిక వెలువడలేదు. ప్రింటింగ్ ప్రెస్ కు వర్కర్స్ రాలేకపోవడంతో పత్రికను నిలిపివేసినట్లు పబ్లిషర్ ఎన్ మురళి తెలిపారు.
తమ ప్రింటింగ్ ప్రెస్ చెన్నైసిటీకి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో మరైమలై నగర్లో ఉందని, వర్షాల కారణంగా వర్కర్స్ అక్కడకు ఎవరూ చేరుకునే పరిస్థితి లేదన్నారు. ప్రింటింగ్ ప్రెస్ చాలా పెద్దది అయినందున తాము నగర శివారులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా ది హిందు 1878లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా, దక్కన్ క్రానికల్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలు యథావిధిగానే ప్రచురితం అయ్యాయి. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. రన్ వే పైకి నీరు చేరటంతో ఎక్కడ విమానాలు అక్కడ నిలిచిపోయాయి.