
బీజేపీ ఒక పనిచేయని ఎద్దు: సీఎం
కర్ణాటక: బీజేపీ పనిచేయని ఎద్దులాంటిదని, రైతులు, దళితుల విషయంలో బీజేపీ నాయకులవి దొంగ ఏడుపులని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. శుక్రవారం దేవనహహళ్లి తాలూకా దొడ్డచెరువులో రూ.883 కోట్లతో చేపట్టిన సాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రసంగం ఆద్యంతం సీఏం సిద్ధరామయ్య బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం బెంగళూరు రానున్న నేపథ్యంలో ఆయనపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అమిత్‌షా ఆటలు ఏమున్నా గుజరాత్, యూపీలో మాత్రమేనని, కర్ణాటకలో సాగవన్నారు. ఆయన వచ్చినంత మాత్రాన రాష్ట్రంలో బీజేపీకి ఒరిగేదేం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు రేయింబవళ్లు మిషన్-150 అంటూ కలలు కంటున్నారని ఆ కల ఎప్పటికీ నెరవేరదన్నారు. యడ్యూరప్పకు నిజంగా దళితులపై అంత ప్రేమ ఉంటే దళిత కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని లేదంటే తమ కులం కుర్రాడికి ఎవరికైనా దళిత యువతిని ఇచ్చి వివాహం చేసి ఆప్రేమను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మొన్నటి వరకూ రైతుల రుణమాఫీపై గగ్గోలు పెట్టిన బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం రైతుల రూ.50వేల లోపు రుణాలు మాఫీ చేయగానే గప్‌చుప్ అయ్యారని, దమ్ముంటే మోదీతో మాట్లాడి జాతీయ బ్యాంకుల్లో ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయించి తమ రైతు ప్రేమను రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు.