
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి భారతీయ జనతాపార్టీ చీఫ్ అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షావి కాలం చెల్లిన వ్యూహాలని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ విజయం తరువాత కర్ణాటక మీద బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో మళ్లీ పాగా వేసేందుకు కమల దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం బెంగళూరు వచ్చారు.
అమిత్ షా బెంగళూరు రావడంపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. అమిత్ షాది కాలం చెల్లిన వ్యూహాలని ఆయన మీడియాతో అన్నారు. అమిత్ షా మ్యాజిక్‌కు కాలం చెల్లిందని.. ఇప్పుడు అది పనిచేయదని సిద్దరామయ్య అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మైసూర్ జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి సిద్ద రామయ్య బరిలోకి దిగనున్నట్లు తెలిసింది.
నవంబర్‌లోనూ బీజేపీ చీఫ్‌పై సిద్దరామయ్య ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక పర్యటనకు వచ్చిన అమిత్ షాను.. ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేని ఒక పర్యాటకుడిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని.. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.