- బడా బాబులకు వల
- కాఫీ, కూల్ డ్రింకుల్లో నిద్రమాత్రలు వేసి నిలువు దోపిడీ
- ‘అనంత’ వ్యాపారి ఫిర్యాదుతో లేడీ కిలాడి అరెస్ట్
- పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్న శివమొగ్గ యువతి
బెంగళూరు : ఉపాధ్యాయురాలినంటూ మాయ మాటలు చెప్పి పలువురిని మోసగిస్తున్న యువతిని ఇక్కడి ఉప్పరపేట పోలీసులు అరెస్టు చేశారు. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన రేణుకా అలియాస్ రేణు ఆలియాస్ రంజని (30)ని అరెస్టు చేశామని శనివారం ఉప్పరపేట పోలీసులు చెప్పారు. ఈమె నుంచి రూ. 2.30 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని, నిందితురాలిని పరప్పన అగ్రహార జైలుకు తరలించామని శనివారం పోలీసు లు తెలిపారు.
టీచర్‌నంటూ బిల్డప్ ... : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిని రేణుకా వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. చుట్టుపక్కల వారితో తాను టీచర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకునేది. ఉద యం అందంగా తయారై బయటకు వచ్చేది. అదే సమయంలో బాగా డబ్బున్న వ్యక్తులకు వలవేసేది. వారిని లాడ్జిలకు తీసుకెళ్లి అనంతరం వారి దృష్టి మరల్చి కాఫీ, కూల్ డ్రింకుల్లో నిద్రమాత్రలు వేసి వారు నిద్రలోకి జారుకున్న అనంతరం వారి వద్ద ఉన్న నగలు, నగదుతో అక్కడి నుంచి జారుకునేది. భార్య అసలు విషయం తెలుసుకున్న భర్త ఆమెను విడిచి పెట్టి దూరంగా ఉంటున్నాడు.
అనంత వ్యాపారి ఫిర్యాదుతో ఊచలు : కొన్ని నెలల క్రితం రేణుకా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దేవాలయానికి వెళ్లింది. అదే సమయంలో అనంతపురంకు చెందిన సంజీవ రెడ్డి అనే వ్యాపారి ఈమెకు పరిచయమయ్యాడు. ఇద్దరు తరచూ మొబైళ్లలో మాట్లాడుకునేవారు.
ఈనెల 4న సంజీవ రెడ్డి వ్యాపారం నిమిత్తం స్నేహితులతో కలిసి బెంగళూరు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రేణుక టీచర్స్ డే సందర్భంగా తాను బెంగళూరు వస్తున్నానని లాడ్జిలో రూం ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో సంజీవరెడ్డి ఇక్కడి కాటన్‌పేటలో ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. ఐదో తారీఖున రేణుక లాడ్జికి వచ్చింది.
ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న అనంతరం కాఫీ ఆర్డర్ ఇచ్చారు. ఇదే సమయంలో సంజీవరెడ్డి బాత్‌రూంకు వెళ్లాడు. అదునుకోసం వేచి చూస్తున్న రేణుక కాఫీలో నిద్రమాత్రలు వేసింది. అనంతరం బయటకు వచ్చిన సంజీవరెడ్డి కాఫీ తాగాడు. కొద్దిసేపటికే అతను నిద్రలోకి జారకున్నాడు. క్షణాల్లో అతని వద్ద ఉన్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు, మొబైల్, నగదు తీసుకుని రేణుక అక్కడి నుంచి ఉడాయించింది.
రాత్రి పొద్దుపోయిన తరువాత నిద్రలేచిన సంజీవరెడ్డి విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల క్రితం ఇక్కడి ఓ లాడ్జిలో ఇదే తరహాలో దోపిడీ జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జిల్లోని సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలించి, బాధితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా రేణుకను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కిలాడీ లేడీ పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కబెడుతోంది.