కీలక నేత లు పార్టీని వీడుతుండటంతో ఆత్మరక్షణలో పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి గురువారం కాస్త ఊరట లభించింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని
న్యూఢిల్లీ: కీలక నేత లు పార్టీని వీడుతుండటంతో ఆత్మరక్షణలో పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి గురువారం కాస్త ఊరట లభించింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన ఢిల్లీ పీసీసీ కంప్యూటర్, రీసెర్చ్ విభాగాధిపతి సంజయ్ పూరి ‘ఆప్’లో చేరారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన పూరి... ఢిల్లీ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి నీనా కపూర్ , జనక్‌పురి నియోజకవర్గ ప్రజలతో కలసి ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే బీజేపీ, బీఎస్పీల నుంచి ఒక్కో కౌన్సిలర్‌లు కూడా ఆప్ చెంతకు చేరారు. వీరిని ఆప్ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ మాట్లాడుతూ కొత్తగా చేరిన వారితో పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడిందని అభిప్రాయపడ్డారు. బీజేపీ కంటే తమ పార్టీకే ఎన్నికల్లో విజయావకాశాలున్నట్లు విశ్లేషించారు. తాజా ఆప్ నేత పూరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ రంగాల్లో విఫలమైందని విమర్శించారు. తనకు టికెట్ నిరాకరించినందువల్లనే ఆ పార్టీని తప్పుపట్టడం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీల త గ్గింపు, నిత్యావసర ధరల నియంత్రణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
టికెట్ ఆశించి భంగపడ్డ పూరి
ప్రస్తుత ఎన్నికల్లో జనక్ పురి నియోజకవర్గలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన సంజయ్‌కు భంగపాటు ఎదురైంది. దీంతో అసంతృప్తి చెందిన ఆయన పార్టీ నుంచి ఇటీవలే బయటికొచ్చారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్న సంజయ్ అనూహ్యంగా ఆప్ కండువా కప్పుకున్నారు. పూరి... కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో పనిచేశారు.