ఉద్ధవ్ ఠాక్రే, అజిత్ పవార్ (ఫైల్)
ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. పన్నులు, సుంకాలు రాకపోవడంతో ప్రభుత్వాలకు నిధులు సమకూరడం లేదు. అంతంతమాత్రంగా నిధులతో పాలన సాగించడం కష్టంగా మారింది. సంక్షోభ సమయంలో నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాలకులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి.
మన దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్ర ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. మార్చి నెల వేతనంలో 60 శాతం కోత విధిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ముఖ్యమంత్రితో ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... క్లాస్ 1,2 ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50శాతం, క్లాస్ 3 ఉద్యోగుల వేతనాల్లో 25శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. క్లాస్ 4 ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వనున్నట్టు చెప్పారు.
కరోనా మహమ్మారిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి భారీ ఎత్తున నిధులు సమకూర్చడంతో పాటు, లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు రాకపోడంతో వేతనాలు కోత పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో బాటలోనే పయనించేందుకు మిగతా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. (కరోనా సంక్షోభం: విద్యుత్ టారిఫ్‌లు తగ్గింపు!)
Comments
Please login to add a commentAdd a comment