
సాక్షి, చెన్నై: గృహ నిర్మాణ పథకం కింద తమకు ప్రభుత్వం కట్టి ఇచ్చిన ఇళ్లు కనిపించడం లేదని ఓ దంపతులు నామక్కల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది కాస్త గృహ నిర్మాణ పథకం విభాగ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు పచ్చ పాళయంకు చెందిన మురుగేష్, కవిత దంపతులు శనివారం కలెక్టరేట్‌కు వచ్చారు. తమ వద్ద ఉన్న ఫొటోలు, ఇతర ఆధారాల్ని కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల విభాగానికి సమర్పించారు. గతంలో తమకు ప్రభుత్వం తరఫున గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరైనట్టు ఫిర్యాదులో వివరించారు. ఇంటి పనులకు పునాదులు వేసే సమయంలో అధికారులు వచ్చారని, ఆ తర్వాత ఏ ఒక్కరూ అటు వైపుగా రాలేదని పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం ఆ గృహ నిర్మాణం పూర్తైనట్టు, తమకు ఆ గృహాన్ని కేటాయించినట్టు రికార్డుల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ విషయంగా గ్రామ అధికారుల్ని నిలదీయగా, ఇళ్లు కట్టి ఇచ్చేశామని, ఇక, తమకు సంబంధం లేదని తేల్చినట్టు పేర్కొన్నారు. తమకు కట్టి ఇచ్చినట్టుగా చెబుతున్న ఇళ్లు ప్రస్తుతం కనిపించడం లేదని, దీనిని తమరే కనిపెట్టి ఇవ్వాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అయితే, ఆ దంపతులకు గృహం నిర్మించి, కేటాయించినట్టుగా రికార్డుల్లో ఉండడంతో, ఈ నిధుల్ని స్వాహా చేసిన వాళ్లెవ్వరో అన్న ప్రశ్న బయలు దేరింది. దీంతో గృహ నిర్మాణ పథకం విభాగం స్థానిక అధికారుల్లో టెన్షన్ బయలుదేరింది. తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండానే, ఇచ్చేసినట్టుగా లెక్కలు తేల్చిన దృష్ట్యా, ఆ ఇళ్లు కనిపించ లేదని, కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశామని, దీనిపై కలెక్టర్ విచారించి తమకు న్యాయం చేకూర్చాలని మీడియాతో మాట్లాడుతూ, ఆ దంపతులు విజ్ఞప్తి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment