కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా లక్ష్య సాధనలో అంగన్‌వాడీ కేంద్రాలు విఫలమవుతున్నాయంటూ రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షుడు జీఆర్ శివశంకర్ విమర్శించారు.
సాక్షి, బెంగళూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా లక్ష్య సాధనలో అంగన్‌వాడీ కేంద్రాలు విఫలమవుతున్నాయంటూ రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం అధ్యక్షుడు జీఆర్ శివశంకర్ విమర్శించారు. గురువారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని పెంచేవిగా అంగన్‌వాడీ కేంద్రాలు తయారవుతున్నాయని, తద్వారా చిన్నారుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయంటూ మానవహక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
రాష్ర్ట వ్యాప్తంగా 64,518 అంగన్‌వాడీ కేంద్రాల్లో 25 లక్షల మంది చిన్నారులు ఉన్నారని వివరించారు. ఒక్కొక్క చిన్నారికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కేటాయించిన ఆరు రూపాయల నుంచి 25 శాతం వాటా అక్రమార్కుల జేబుల్లోకి చేరిపోతుండడంతో లక్ష్య సాధన ఎంత వరకు సాధ్యమని ప్రశ్నించారు. చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కరువయ్యాయని అన్నారు.
అంగన్‌వాడీల పని వేళలను సాయంత్రం నాలుగు గంటల వరకు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ కారణంగా మధ్యాహ్న సమయంలో చిన్నారులు నిద్రకు దూరమవుతున్నారని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 1 నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులే ఉంటారని, వారికి సరైన నిద్రను దూరం చేయడం ద్వారా చిన్నారుల హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం న్యాయమూర్తి ఎస్‌కే పాటిల్ కమిటీ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఏడాదికి రెండు సార్లు యూనిఫామ్‌లు అందజేయాలని కోరారు. ప్రతిమూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. మధ్యాహ్న సమయం చిన్నారులు నిద్రించేందుకు వీలుగా చాప, బెడ్‌షీట్‌లను అందజేయాలని, కేంద్రాల పని వేళలను మధ్యాహ్నం 1.30 గంటలకు పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ రెండవ వారం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు తాళం వేసి సమ్మెకుదిగుతామని హెచ్చరించారు.