‘స్వచ్ఛ భారత్’లో డబ్బావాలాలు
ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, ముంబై: ఇకపై స్వచ్ఛ భారత్‌లో డబ్బావాలాలు భాగస్వాములు కానున్నారు. తమ మూడు లక్షల పైచిలుకు వినియోగదారులకు స్వచ్ఛ భారత్ మెసేజ్‌ను అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవగాహన కార్యక్రమంలో ‘ముంబై జేవిన్‌డబ్బే వాహతుక్ మహామండల్’కు చెందిన దాదాపు 3,500 నుంచి 4,000 మంది డబ్బావాలాలు పాల్గొననున్నారు. తమ వినియోగదారులకు పరిశుభ్రత కోసం పాటించాల్సిన నియమాలను చిట్టీల రూపంలో టిఫిన్ బాక్సుల్లో ఉంచుతామని డబ్బావాలా సంఘం అధికార ప్రతినిధి సుభాశ్ తాలేకర్ అన్నారు.
టిఫిన్ బాక్స్‌లను సేకరించేటప్పుడు ఒక వాక్యం శ్లోకం, కీర్తనల ద్వారా కూడా వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ ప్లాన్ చేసినట్లు తెలిపారు. వీలైనన్ని మార్గాలను అనుసరించి అవగాహన కల్పించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచే ఈ ‘స్వచ్ఛ’ కార్యక్రమాన్ని డబ్బావాలాల సంఘం సతారాలోని ప్రతాప్ ఘడ్ కోట వద్ద స్వీకరించినట్లు తెలిపారు.