‘డీడీఏ’ స్కాంలో మరో ముగ్గురి అరెస్టు
Published Thu, Sep 12 2013 2:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) ప్లాట్ల కుంభకోణంలో మరో ముగ్గురిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. డీడీఏ ప్లాట్లు ఇస్తామంటూ అమాయకుల నుంచి రూ.3.83 కోట్ల దండుకున్న కేసులో ఇప్పటికే నలుగురు కటకటాలపాలైన విషయం తెలిసిందే . బుధవారం అరెస్టయిన ముగ్గురిలో ఇద్దరు డీడీఏ ఉద్యోగులు ఉన్నట్లు క్రైం బ్రాంచి అడిషనల్ కమిషనర్ అరవిందర్ యాదవ్ తెలిపారు. పోలీసులు పేర్కొన్న ప్రకారం.. ప్రేమ్ శంకర్ ముఠాకి చెందిన నిందితులంతా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ముఖర్జీనగర్‌కి చెందిన కన్వల్‌సాహ్ని అనే వ్యక్తికి డీడీఏ కార్యాలయం నుంచి డీడీఏ ప్లాట్ కేటాయించినట్టు ఓ లెటర్ వచ్చింది. ఇందుకు సంబంధించి అతడు డీడీఏ కార్యాలయం పేరుతో కొంత మొత్తాన్ని డీడీ రూపంలో అందులో ఉన్న నంబర్‌లో జమ చేశాడు. తర్వాత కొన్నాళ్లకి తనకు ఇచ్చిన ధ్రువపత్రాలు నకిలీవని తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును క్రైం బ్రాంచికి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీనిలో డీడీఏకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర సైతం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
బుధవారం నవీన్‌కుమార్, అజయ్‌కుమార్, శైలేందర్ భాటియాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం ముఠాకి ప్రేమ్‌శంకర్ శర్మ నాయకుడని పోలీసులు గుర్తిం చారు. అతడి ఆధ్వర్యంలోనే బాధితులకు నకిలీ అలాట్‌మెంట్ లెటర్లు పంపినట్టు గుర్తించారు. నిందితులంతా కలిసి రూ.3.83 కోట్ల రూపాయలు దండుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందతులందరినీ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు.
Advertisement