ఓటమి సాధారణమే
- లోక్‌సభ ఎన్నికలపై సీఎం సిద్ధు
- పరమేశ్వరతో కలిసి ఢిల్లీలో ఆంటోనితో భేటీ
- పార్టీ బలోపేతమే లక్ష్యం : పరమేశ్వర
- సీఎం రేసులో లేను : దేశ్‌పాండే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు గెలుపోటములు సర్వ సాధారణమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపై అధిష్టానానికి వివరణ ఇవ్వడానికి బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన, కేపీసీసీ చీఫ్ పరమేశ్వరతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కర్ణాటక మాత్రమే కాకుండా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై కేంద్ర మాజీ మంత్రి ఏకే. ఆంటోనీ నాయకత్వంలో ఏర్పడిన కమిటీతో సమావేశమవడానికి పరమేశ్వరతో కలసి ఆయన వెళ్లారు. ఆంటోనీతో జరిగిన సమావేశంలో ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించడంతో పాటు పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించినట్లు విలేకరులకు పరమేశ్వర తెలిపారు.
కాగా ఎన్నికల్లో పార్టీ ఓటమికి సీఎం వైఖరే కారణమని గత వారాంతంలో ఇక్కడ జరిగిన ఆత్మావలోకన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పరోక్షంగా ఆరోపించడంతో వారిద్దరి ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పదవి ఉంటుందో, ఊడుతుందో అని అదే సమావేశంలో సీఎం వేదాంత ధోరణిలో మాట్లాడడం చర్చనీయాంశమైంది. నాయకత్వ మార్పు దిశగా కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందా అనే సందేహాలూ తలెత్తాయి.
సీఎంకు దేశ్‌పాండే బాసట
శాసన సభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడారు. శాసన సభ వెలుపల ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం సీఎంను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించిందని, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆయనే కారణమంటూ పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఆరోపించారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చక్కగా పని చేస్తున్నారని కితాబునిస్తూ, ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. అల్ప సంఖ్యాకులు, వెనుకబడిన తరగుతులు, దళితులతో కూడిన ‘అహింద’ ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య నడుపుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పస లేనివని కొట్టి పారేశారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
ఇటీవల శాసన మండలికి ఐదుగురిని నామినేట్ చేసిన విషయంలో సీఎం ‘కోటరీ’ పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఎంపికలు జరిగాయని వివరించారు. రాష్ర్ట మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతే పేర్లను ఖరారు చేశారని తెలిపారు. కాగా తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.