స్మార్ట్ ఫోన్‌ద్వారా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని నగరవాసులు సులువుగా తెలుసుకోవచ్చు.
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్‌ద్వారా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని నగరవాసులు సులువుగా తెలుసుకోవచ్చు. దీంతోపాటు సంబంధిత పోలింగ్ అధికారి పేరు కూడా తెలుసుకునే వీలుంది. ఇందుకు సంబంధించి ‘ఢిల్లీ ఎలక్షన్’ పేరిట ఎన్నికల కార్యాలయం ఓ యాప్‌ను విడుదల చేసింది. ఇంకా తమ నియోజకవర్గంతోపాటు ఓటరు జాబితాలో నమోదు చేసిన దరఖాస్తు ఏ స్థితిలో ఉందనే విషయాన్ని కూడా తెలుసుకునే వీలుంది. ఈ మేరకు ఇటీవల ఈ యాప్‌ను తమ కార్యాలయం విడుదల చేసిందని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. ప్రస్తుతం అనేకమంది స్మార్ట్‌ఫోన్‌ను అనేకమంది వినియోగిస్తున్నందువల్ల ఈ యాప్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
విధానసభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమాచారమైనా ఇందులో దొరుకుతుందన్నారు. ఇదిలాఉంచితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవల ఓ ఎస్‌ఎంఎస్ సేవను కూడా ప్రారంభించింది. దీంతో ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకునే వీలుంది. ఇందుకోసం ఈపీఐసీ స్పేస్ ఓటర్ ఐడీ అని టైప్ చేసి సదరు సందేశాన్ని 773299899 లేదా 1950 నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. ఇంకా సీఈఓ.ఢిల్లీ.గవ్.ఇన్ వెబ్‌సైట్‌లో కూడా తనిఖీ చేసుకోవచ్చు. కాగా ఎన్నికల కమిషన్ అందించిన సమాచారం ప్రకారం జాతీయ రాజధాని నగరంలోని జనాభాలో యువ ఓటర్ల సంఖ్య 1.31 శాతంగా ఉంది.