పోలీసులకు ప్రత్యేక శిక్షణ
Published Sun, Jan 5 2014 10:31 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
న్యూఢిల్లీ: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు త్వరలో ఢిల్లీ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. దీని ప్రకారం ఢిల్లీ పోలీస్ శాఖలోని సీనియర్ అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం వారం రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఢిల్లీపోలీస్ శిక్షణ శాఖలోని ఒక సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ ‘ బయట విధుల్లో ఉన్న పోలీసులందరినీ శిక్షణ తరగతులకు రప్పించడం కష్టం కాబట్టి శిక్షణాధికారులే సిబ్బంది దగ్గరకు వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. దీని ప్రకారం శిక్షణ ఇచ్చే అధికారులను ఆరు బృందాలుగా విభజించాం. ఒక్కో బృందంలో ఇద్దరు అధికారులుంటారు. ఈ బృందాలు ప్రతిరోజూ ఆరు పోలీస్‌స్టేషన్లను సందర్శిస్తాయి.
మధ్యాహ్నం రెండుగంటల నుంచి ఐదు గంటల వరకు ఆయా స్టేషన్ల సిబ్బందికి నేర శిక్షాస్మృతి, భారతీయ శిక్షాస్మృతిపై శిక్షణ ఇస్తాయి’ అని తెలిపారు. ఏ రోజు ఏఏ పోలీస్‌స్టేషన్లకు శిక్షణా బృందాలు వెళతాయనేది ముందే సమాచారం ఇస్తాం కాబట్టి ఆయా రోజుల్లో సదరు పోలీస్‌స్టేషన్ల సిబ్బంది తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంద’ని ఆయన స్పష్టం చేశారు. 160 పోలీస్‌స్టేషన్లలో ఉన్న సిబ్బంది అందరికీశిక్షణ ఇవ్వగలమనే నమ్మకముందని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో శిక్షకులు ఆడియా, వీడియో వనరులను వినియోగించుకుంటారన్నారు. ‘మహిళలపై అత్యాచారాలకు సంబంధించి చట్టాల్లో వస్తున్న సవరణలు ముఖ్యంగా ‘పోక్సో’పై నగర పోలీస్ సిబ్బందికి తగిన అవగాహన లేకపోవడంతో ఆయా కేసులను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారని పోలీస్ శాఖ భావిస్తోంది.
దీనిని అధిగమించేందుకు సిబ్బందికి చట్టాల సవరణలపై తగిన అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులకు రూపకల్పన చేసినట్లు ఆ అధికారి తెలిపారు. ‘ఢిల్లీ పోలీస్ శాఖ నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన కానిస్టేబుళ్లకు ఇప్పటికే మూడు వారాల రిఫ్రెషర్ కోర్సును ప్రారంభించింది. కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు కేసుల విచారణ, దర్యాప్తు సమయంలో కొత్తకొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంటుంది. అందువల్ల నాలుగేళ్ల సర్వీసు తర్వాత వారు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొని తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం’ అని సీనియర్ అధికారి తెలిపారు.‘కానిస్టేబుళ్ల ఈ శిక్షణ తరగతులు గత 8 నెలలుగా కొనసాగుతున్నాయన్నాయి. ప్రస్తుతం ఒక్కో బ్యాచ్‌లో 250 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 400 చేయాలని యోచిస్తున్నాం..’ అని ఆయన వివరించారు.
సబ్ ఇన్‌స్పెక్టర్లకు సైతం..
ఇదిలా ఉండగా, కానిస్టేబుళ్లకు అందిస్తున్న శిక్షణ వంటిదే సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఇచ్చేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. తర్వాత ఈ శిక్షణ కార్యక్రమాలను ఏసీపీ స్థాయి వరకు విస్తరించాలని యోచిస్తోంది. కాగా బాధితుల ఫోన్లకు స్పందిం చడం, నేరస్తులను పట్టుకోవడం, దర్యాప్తు తదితర విషయాలపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. అలాగే విధి నిర్వహణలో ఒత్తిడిని తట్టుకోవడం ఎలా.. అనే దానిపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, ఢిల్లీలో ఉగ్రవాదుల దాడులు, బాంబుల బెదిరింపులు, వీవీఐపీ రహదారుల్లో భద్రత హై అలర్ట్ సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు వంటి వాటిని ఈ కోర్సులో కొత్తగా చేర్చనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఢిల్లీ పోలీస్ శాఖలోని సీనియర్ అధికారుల సహా ప్రతి ఒక్కరూ ఏడు రోజుల శిక్షణ తరగతులకు తప్పకుండా హాజరవుతార’ని స్పష్టం చేశారు.
Advertisement