న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చే విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం వర్సిటీలో పెరిగిన విదేశీ విద్యార్థుల అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. 2012 డిసెంబర్ 16న నగరంలో జరిగిన మహిళ గ్యాంగ్ రేప్ సంఘటన ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. అంతేకాక ఉన్నతవిద్య చదవడానికి సురక్షిత ప్రాంతంగా ఢిల్లీ ఉంటుందని విదేశీ మహిళలు భావిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ఫారిన్ స్టూడెంట్ రిజర్వేషన్ ఆఫీస్(ఎఫ్‌ఎస్‌ఆర్‌ఓ) డాటా ప్రకారం 2014-15 సంవత్సరంలో 1,184 మంది విదేశీ విద్యార్థులు వర్సిటీలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మహిళా విద్యార్థుల సంఖ్య 492 నుంచి 546కు పెరిగింది. 2011-12లో విదేశీ విద్యార్థుల సంఖ్య 952గా, 2012-13లో 1,007గా ఉంది. 2011-12లో మహిళా విద్యార్థుల సంఖ్య 434గా ఉంది.
దక్షిణాసియా, దక్షిణ తూర్పు ఆసియా నుంచే ఎక్కువ:
ముఖ్యంగా దక్షిణ ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, యూరోపియన్, ఆఫ్రికా దేశాల విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఆర్‌ఓ అధికారి అమ్రిత్ కుమార్ బస్రా వెల్లడించారు. యూనివర్సిటీలో జరిగిన అంతర్గత సమావేశంలో....రేప్ సంఘటన ప్రభావం విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై పడలేదనే విషయం అర్థమైందని ఆమె చెప్పారు. ‘వారిలో కచ్చితంగా ఆందోళన ఉంటుంది. కానీ భయపడటం లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరం దక్షిణాసియా, దక్షిణ తూర్పు ఆసియాలోని నేపాల్ నుంచి 311, ఆఫ్ఘనిస్థాన్ నుంచి 55, మాల్దీవుల నుంచి 36, శ్రీలంక నుంచి 23, వియాత్నం నుంచి 23, భూటాన్ నుంచి 22, బంగ్లాదేశ్ నుంచి 10, ఇండోనేషియా నుంచి 7 మంది విద్యార్థులు ఢిల్లీ వర్సిటీలో అడ్మిషన్లు పొందారు. అలాగే మధ్య ప్రాచ్య, యూరోపియన్, ఆఫ్రికా దేశాల నుంచి కూడా క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇరాన్ నుంచి 11, ఇరాక్ నుంచి 7, నైజీరియా నుంచి 11, కాంగో నుంచి 10, జింబాబ్వే నుంచి 10, సోమాలియా నుంచి ఇద్దరు వర్సిటీలో చేరారు’ అని బస్రా తెలిపారు.
నాణ్యమైన విద్య, తక్కువ జీవన వ్యయమే కారణం:
నాణ్యమైన విద్య, తక్కువ జీవన వ్యయమే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని అమ్రిత్ కుమార్ బస్రా చెప్పారు. అదేవిధంగా వారు వర్సిటీలోనే ఉండేలా కచ్చితమైన నియమాలను పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసర్చ్ ప్రోగ్రామ్స్ విభాగాల్లో విదేశీ విద్యార్థులకు 5 శాతం సీట్లు రిజర్వ్ చేసినట్లు ఆమె తెలిపారు. వర్సిటీ నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు తక్కువగా అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే తప్ప, ఆ సీట్లను ఇతర కేటగిరీలకు మార్చడానికి అవకాశం ఉండదు. అదే విధంగా వర్సిటీలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా అంతర్జాతీయ హాస్టల్ సదుపాయాలు, వేర్వేరు బస్ సదుపాయం అందుబాటులో ఉందని ఆమె పేర్కొన్నారు.
ఢిల్లీ వర్సిటీలో పెరుగుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య
Published Sun, Mar 22 2015 10:30 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
Advertisement
Advertisement