కోర్టులో విడాకుల కేసు రాజీ, రాత్రికి..
భార్యను కొడవలితో నరికి చంపిన భర్త
బెంగళూరు(బనశంకరి): భార్యను బాగా చూసుకుంటానని కోర్టులో చెప్పిన భర్త..చివరకు ఆమె పాలిట యముడయ్యాడు. రాత్రి సమయంలో ఆదమరచి నిద్రిస్తున్న భార్యను కొడవలితో నరిచి హత్య చేశాడు. ఈ ఘటన కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సుకందకట్టెలోని శ్రీనివాసనగరకు చెందిన ఆటో డ్రైవర్ పునీత్‌కు పల్లవి (23)తో ఆరేళ్లక్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య కలహాలు చోటు చేసుకోవడంతో ఆరునెలలుగా విడివిడిగా ఉంటున్నారు.
ఈ క్రమంలో పునీత్ విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గురువారం కోర్టులో జరిగిన విచారణకు దంపతులు హాజరయ్యారు. రాజీకి వచ్చి కలిసి ఉండటానికి నిశ్చయించకున్నారు. అయితే రాత్రి 9.30 గంటల సమయంలో నిద్రలో ఉన్న పల్లవిపై పునిత్ కొడవలితో నరికి ఉడాయించాడు. కామాక్షీపాళ్య పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం ఎగ్జామినేషన్ కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.