
విజయకాంత్‌కు ఓటమి భయమా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘స్థానబలిమే గానీ తన బలిమి కాదని’ అనేది విజయాన్ని సాధించిన నేపథ్యంలో చలామణి ఉండే ప్రాచీన సామెత. అయితే తన బలిమిపై విజయకాంత్‌కు సందేహమో ఏమో స్థాన బలిమి కోసం తరచూ నియోజకవర్గాన్ని మారుస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు.
ఇక అసలు విషయంలోకి వస్తే, డీఎండీకేను స్థాపించినపుడు విజయకాంత్ 2006లో తొలిసారిగా విరుదాచలం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆనాటి ఎన్నికల్లో డీఎండీకే తరఫున పోటీచేసి గెలిచిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ వైపు వెళ్లలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా విజ్ఞప్తులను పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశన్ స్వీకరించేవాడు.
అడపాదడపా విజయకాంత్ బావమరిది, యువజన విభాగం అధ్యక్షుడు సుదీష్ వెళ్లి ప్రజలను కలిసేవాడు. ఆ తరువాత 2011 నాటి ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్నాడు. ఆనాటి ఎన్నికల్లో విజయకాంత్ ఆశించిన స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులను జయలలిత ప్రకటించడంతో కోపగించుకుని వామపక్షాలతో కలిసి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జయలలిత మళ్లీ విజయకాంత్‌ను బుజ్జగించి రిషివైద్యం నియోజకవర్గం నుంచి పోటీకి సమ్మతించారు. ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రతిపక్ష నేత హోదాకు ఎదిగారు.
ఈసారి ఉళుందూర్ పేట
మూడోసారి ముచ్చటగా విజయకాంత్ మరోసారి నియోజకవర్గం మార్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉళుందూరుపేట నుంచి విజయకాంత్ పోటీ చేస్తాడని పార్టీ ప్రకటించింది. గెలిచినా, ఓడినా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడరనే విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. తొలి ఎన్నికల్లో ఒంటరిపోరు, మలి ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా గెలుపొందారు. ప్రస్తుతం ప్రజా సంక్షేమ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్‌కు గెలుపు ప్రతిష్టాత్మకమని ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. దీంతో విజయకాంత్‌కు గెలుపు అనివార్యమైంది. ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా కూటమి పరువు పోవడం ఖాయం. గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తే ప్రజలు ఓడించి తీరుతారనే భయంతోనే విజయకాంత్ ఈసారి ఉళుందూర్‌పేటను ఎన్నుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాసంక్షేమ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలో ఉన్న విజయకాంత్ గెలుపోటముల మాటెలా ఉన్నా గణనీయమైన సంఖ్యలో ఓట్లను చేకూర్చాలని కూటమిలోని అన్నిపార్టీల నేతలు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.