అన్నాడీఎంకేను సాగనంపండి!
టీనగర్: డీఎంకే ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాలని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్టాలిన్ శుక్రవారం కోయంబత్తూరు జిల్లాలో ప్రచారం చేశారు. శనివారం నీలగిరి జిల్లా, కున్నూరులోను, సాయంత్రం ఈరోడ్ జిల్లాలోను ప్రచారం జరిపారు. సత్యమంగళం బస్టాండ్‌లో భవానిసాగర్ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి సత్య, కచ్చేరిమేడులో గోపి నియోజకవర్గం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శరవణన్, అందియూరు డీఎంకే అభ్యర్థి వెంకటాచలం, మొడకురిచ్చిలో డీఎంకే అభ్యర్థి సచ్చిదానందం, పెరుందురైలో డీఎంకే అభ్యర్థి కేపీ స్వామిలకు మద్దతుగా ప్రసంగించారు.
ఈరోడ్ వెస్ట్ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి ముత్తుసామి, ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గం మక్కల్ డీఎండీకే అభ్యర్థి చంద్రకుమార్‌కు మద్దతుగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొందరు తామే బడా నాయకులమని చెప్పుకుంటూ ప్రజల గుర్తింపునకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. వారు ఎవరనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. 2011లో జయలలితను ముఖ్యమంత్రి పదవిలో అధిష్టింపచేసిన వ్యక్తుల్లో చంద్రకుమార్ కూడా ఒకరన్నారు. అప్పట్లో తాను పెద్ద పొరపాటు చేసినట్లు ప్రస్తుతం ఆయన ఒప్పుకుంటున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి జయలలిత ఒక్క రోజైనా ఈరోడ్‌ను సందర్శించారా? అన్ని ప్రశ్నించారు.
జయ ఉత్తర్వుల ప్రకారం నాడు శశిపెరుమాళ్ ప్రాణాలను కాపాడేందుకు విఫలమైన పోలీసు శాఖ అధికారులు, నేడు మనసు మార్చుకుని తమ వైపు వస్తున్నట్లు తెలిపారు. తదుపరి డీఎంకే అధికారం చేపట్టడం ఖాయమన్న భావనతో వారు అప్రమత్తమైనట్లు తెలిపారు. కరుణానిధి వడ్డితో కలిపి విద్యారుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించారన్నారు. ప్రస్తుతం ఉన్న అమ్మ క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్ల పేరిట ఆధునీకరించి అప్‌గ్రేడ్ చేస్తారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కాకుండా నియోజకవర్గం స్థాయిలో కరుణానిధి ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారని, ప్రజలందరి కోర్కెలు నెరవేర్చబడతాయన్నారు. అందుకు ప్రజలంతా చేయాల్సింది అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమేనన్నారు.