ఫుట్‌పాత్‌లపై డ్రైవింగ్ వద్దు
- శాస్త్రీయ నృత్య కళాకారిణి వాణి గణపతి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో ఇటీవల ఫుట్‌పాత్‌లపై బైక్‌లను నడుపుకుంటూ వెళ్లడం సాధారణమై పోయిందని, ఈ పోకడను విడనాడాలని ప్రముఖ భరత నాట్య కళాకారిణి వాణి గణపతి కోరారు. ప్రముఖ 3డీ యానిమేషన్ సంస్థ మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సినిమాటిక్స్ (మ్యాక్) న గర ట్రాఫిక్ పోలీసుల గురించి తీసిన 17 నిముషాల డాక్యుమెంటరీని ఇక్కడి అదనపు కమిషనర్ (ట్రాఫిక్) కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రదర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ట్రాఫిక్‌లో ఇబ్బందులకు అందరూ పోలీసులనే నిందిస్తారని చెబుతూ, ఎవరికి వారు తాము ముందు వెళ్లిపోవాలనే ఆత్రుతే అన్ని అనర్థాలకు కారణమవుతోందని తెలిపారు. కనుక ప్రజలు మేల్కొని ట్రాఫిక్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సి ఉందన్నారు.
నగరంలో రాజకీయ పార్టీల బహిరంగ సభల సందర్భంగా ట్రాఫిక్ అస్తవ్యస్తమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాల వేదికలను నగర శివార్లలోకి మార్చుకోవాలని ఆమె కోరారు. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం పెద్ద సవాలు లాగా తయారైందని అన్నారు. ట్రాఫిక్ ప్రధాన సవాలుగా మారుతోందని తెలిపారు. నగరంలో ప్రస్తుతం 53 లక్షల వరకు రిజిస్టరైన వాహనాలున్నాయని వెల్లడించారు. వీటికి తోడు ఇతర జిల్లాల నుంచి కూడా వాహనాలు వస్తుంటాయన్నారు.
దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలు ఏ నగరంలోనూ లేవని తెలిపారు. అసలు..ఆసియాలో కూడా ఏ నగరంలోనూ ఇన్ని వాహనాలు లేవని చెబుతుంటారని, అయితే దీనికి కచ్చితమైన ఆధారాలు లేవని చెప్పారు. పోలీసులు రోజుకు 14 నుంచి 16 గంటలు అలుపెరగక విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆయన వాపోయారు. అదనపు కమిషనర్ (ట్రాఫిక్) బీ. దయానంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యాక్‌కు చెందిన 14 మంది విద్యార్థులు మూడు నెలల పాటు శ్రమించి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.