‘గాడిదల వ్యాపారం’ జరుగుతోందా!
‘ఓటుకు నోటు’ పై హెచ్.డి.దేవేగౌడ గరం
ఎన్నికలను రద్దు చేయాలి
బెంగళూరు: రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో చోటు చేసుకున్న ‘ఓటుకు నోటు’ వ్యవహారంపై మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హెచ్.డి.దేవేగౌడ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తామేమీ అభ్యర్థులకు తాయిలాలు ప్రకటించడం లేదని, ఎవరినీ ప్రలోభాలకు గురిచేయడం లేదనీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బెంగళూరులోని పద్మనాభనగరలో ఉన్న తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘ఇది అభ్యర్థుల కొనుగోలు కాకపోతే మరేంటి, గాడిదల వ్యాపారం జరుగుతోందా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను రాజ్యసభకు గెలిపించుకోగలగుతుంది. ఆ తర్వాత వారి వద్ద మిగిలిన 33 ఓట్లకు ఇతర స్వతంత్రులను కలుపుకొని మూడో స్థానాన్ని పొందాలని చూస్తున్నారు. ఆ స్వతంత్రుల ఓట్లు వీరు ఎలా సాధిస్తారు, ఇది ప్రలోభాలకు గురిచేయడం కాక మరేమిటి’ అని దేవేగౌడ ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని దేవేగౌడ డిమాండ్ చేశారు.జూలై 12న పార్టీ కోసం నిజంగా శ్రమించే కార్యకర్తలు, నాయకులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన చేయూత కారణంగా నాయకులైన వారు, పార్టీ చేసిన మేలును మరిచిపోయి తమకే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని దేవేగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.