కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహరాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఉన్న ప్రభుత్వ అతిథి గృహంలో జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, ...
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహరాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఉన్న ప్రభుత్వ అతిథి గృహంలో జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రత్యక్షం కావడం రాష్ట్ర రాజకీయాల్లో కొంతసేపు ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ‘డిగ్గీ’ ప్రభుత్వ అతిథి గృహం కుమారకృపాలో విడిది చేశారు. ఆయనను కలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా మంది శనివారం ఉదయం అక్కడకు చేరుకున్నారు.
ఇదే సమయంలో దేవెగౌడ కూడా తన అనుచరులను కొంతమందిని వెంటబెట్టుకుని అక్కడకు వచ్చారు. రెండు వేర్వేరు పార్టీలకు చెందిన అధినాయకులను ఒకే చోట చూడటంతో అటు కాంగ్రెస్ ఇటు జేడీఎస్ కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. కుమారకృపలో తన గదిలోకి వెళ్లి బయటకు వచ్చిన దేవెగౌడను మీడియా చుట్టుముట్టి ఈ విషయమై వివరణ అడుగగా ‘ప్యాలెస్ మైదానంలో ఈ రోజు (శనివారం) పార్టీ సభ్యత్య నమోదు కార్యక్రమం ఉంది. ఇందులో పార్టీ పదాధికారులు, పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు అందరు నాయకులు పాల్గొననున్నారు. నేను కూడా అక్కడికే వెలుతున్నా. ప్రయాణ బడలిక వల్ల స్నానం చేద్దామని కుమారకృపకు వచ్చా. దీనికే ఇంత అర్థం తీయాలా?’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.